త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ

త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ

నియంత్రణ రేఖను దాటి భారతీయ వాయుసేన బాలాకోట్ లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అతిపెద్ద శిక్షణా శిబిరంపై దాడి చేసి జైషే చీఫ్ మసూద్ అజహర్ బావమరిది సహా దాదాపు 400 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సాయంత్రం త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. పాక్ ఏ విధమైన ప్రతీకార చర్యకు దిగినా దేశం సంసిద్ధంగా ఉందని సైన్యాధిపతులు ప్రధానికి వివరించారు. ఆపరేషన్ విజయవంతం కావడంపై ప్రధానమంత్రి సైన్యాధిపతులను ముఖ్యంగా చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీ ఎస్ ధనోవాను అభినందించారు. ముగ్గురు సైన్యాధిపతులు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కలిశారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా సర్వసన్నద్ధంగా ఉండటంపై ఆయనతో చర్చించారు. పాకిస్థాన్ సరైన సమయంలో సరైన ప్రదేశంలో స్పందిస్తామని చెప్పడంతో ముగ్గురు మిలిటరీ చీఫ్స్ తో సమావేశం నిర్వహించారు. 

అటు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా త్రివిధ దళాధిపతులు, ఇతర అధికారులతో కూడిన నేషనల్ సెక్యూరిటీ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ సాయుధ దళాలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. తమ దేశంలో ఉగ్రవాదుల సమాచారం గురించి భారత్ బలమైన ఇంటెలిజెన్స్ ఆధారాలు చూపిస్తే తాము చర్యలు తీసుకుంటామని పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత చేసిన ప్రకటనలో ఇమ్రాన్ తెలిపారు. భారత్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తాము గట్టిగా జవాబిస్తామని ఆయన హెచ్చరించారు.

ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు 12 మిరాజ్ 2000 ఫైటర్ జెట్లు నియంత్రణ రేఖ దాటి వెళ్లి 1,000 కిలోల బాంబులను బాలాకోట్ లోని ఉగ్రవాద శిక్షణ కేంద్రంపై వేశాయి. ఇక్కడ ఆత్మాహుతి దాడి శిక్షణ ఇస్తున్నారు. జైషే మొహమ్మద్ ఈ శిబిరంలో ఫిదాయీ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మరిన్ని ఆత్మాహుతి దాడులకు సిద్ధమవుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసినట్టు భారత ప్రభుత్వం తెలిపింది. జైషే మొహమ్మద్ ఆత్మాహుతి బాంబర్ జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిపిన దాడిలో 40 మంది సైనికులు మరణించారు.