తిరుపతిలో మోడీ సభకు సర్వం సిద్ధం..

తిరుపతిలో మోడీ సభకు సర్వం సిద్ధం..

రెండో సారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ... ఇవాళ కళియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అయితే, ప్రధాని తిరుపతి, తిరుమల పర్యటన సందర్భంగా.. తిరుపతి  ఎయిర్‌పోర్ట్ సమీపంలోనే ఓ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలు. ఈ సభాస్థలాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు శనివారం పరిశీలించారు. ఆదివారం సాయంత్రం విమానాశ్రయం రహదారి కార్బన్‌ సెల్‌ఫోన్‌ కంపెనీ మైదానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 5 వేల మంది కూర్చునేలా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. షెడ్డుకు ముందు భాగంలో ప్రధాన మంత్రి పాల్గొనే వేదికను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, భానుప్రకాష్‌రెడ్డి తదితర నేతలు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్‌ డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, జేసీ గిరీషా, వివిధ శాఖల ఉన్నతాధికారులు సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లు పక్కాగా ఉండాలలినన కిందస్థాయి అధికారులకు సూచించారు. నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా విజయోత్సవ సభని ఏర్పాటు చేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలంగాణ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కించుకున్న కిషన్‌రెడ్డి కూడా హాజరుకానున్నారు. ఇక, రెండో సారి ప్రధాని అయిన తర్వాత తిరుమలకు వస్తున్న మోడీకి ఘనంగా స్వాగతం పలకడానికి సిద్ధమైంది ఏపీ బీజేపీ.