మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తాం: మోడీ

మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తాం: మోడీ

సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ టీఎంసీ కార్యకర్తల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కోల్‌క‌తాలో అమిత్ షా రోడ్డు షో స‌మ‌యంలో జ‌రిగిన అల్లర్లలలో ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ విగ్రహం ధ్వంస‌మైన విష‌యం తెలిసిందే. అయితే విగ్రహం ధ్వంసం అయిన చోటే మ‌రో భారీ విగ్రహాన్ని ప్రతిష్టాప‌న చేస్తాన‌ని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లోని మావు పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ... ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బెంగాల్‌లో హింస చెలరేగడానికి కారణం ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే కారణమని ఆరోపించారు. విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చింది టీఎంసీ కార్యకర్తలేనని ఆరోపించారు. విద్యాసాగ‌ర్ విజన్‌కు తాము క‌ట్టుబడి ఉన్నామ‌ని, పంచ‌లోహాల‌తో త‌యారు చేసిన విద్యాసాగ‌ర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. గతంలో కూడా టీఎంసీ కార్యకర్తల గూండాయిజం వల్ల తాను ఎన్నికల ప్రచారాన్ని మధ్యలో నిలిపివేసి, వేదిక దిగాల్సిన పరిస్థితి వచ్చిందని మోడీ ఆరోపించారు.