హౌడీ-మోడీ సభలో ట్రంప్‌కు స్టాండింగ్ ఒవేషన్

హౌడీ-మోడీ సభలో ట్రంప్‌కు స్టాండింగ్ ఒవేషన్

 హౌడీ-మోడీ సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్న ట్రంప్ ఉక్కు సంకల్పానికి మద్దతుగా సభకు హాజరైనవారంతా ఒక్కసారిగా నిలబడి చప్పట్లు కొట్టారు. మోడీ పిలుపు మేరకు సభకు హాజరైన ప్రవాస భారతీయులంతా నిలబడి ట్రంప్‌కు మద్దతుగా చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌- అమెరికా స్వప్నాలు సాకారం చేసేందుకు మోడీతో కలిసి పనిచేస్తామని అన్నారు.

భారత్‌-అమెరికా సంబంధాలు ఎన్నడూలేనంత బలోపేతమయ్యాయని చెప్పారు. సరిహద్దు భద్రత అనేది భారత్‌, అమెరికాకు అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. సరిహద్దు భద్రత అంశంలో భారత్‌కు సహకరిస్తామని చెప్పారు ట్రంప్. ఆ తర్వాత మాట్లాడిన ప్రధాని మోడీ.. 9/11 ఉగ్రదాడులు, 26/11 ముంబై ఉగ్రదాడుల మూలం ఒక్కటేనని ప్రధాని మోడీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పాక్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.

ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు సహాయసహకారాలు అందిస్తామన్న ట్రంప్ కు  ధన్యవాదాలు అన్నారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూకాశ్మీర్ లో దుర్వినియోగానికి గురైందని, అందుకే రద్దు చేశామని మోడీ అన్నారు. అలాగే ఉగ్రమూలాలు ఏదేశంలో ఉన్నాయో ప్రపంచానికి తెలుసని పరోక్షంగా పాకిస్థాన్‌కు చురకలు అంటించారు మోడీ. ఇక వచ్చే నెలలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించారు. ఈ సభకు 70 వేలకు పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. హూస్టన్‌లో సుమారు 200 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మొత్తం 600 మంది నిర్వాహకులు, 1500 మంది వాలంటీర్లు శ్రమించారు.