రాహుల్‌ది ఆకాశమంత అహంకారం: మోడీ

రాహుల్‌ది ఆకాశమంత అహంకారం: మోడీ

ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమేనంటూ ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని బంగారపేటలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌ పేరును నేరుగా ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. 'తాను ప్రధాని కాబోతున్నానని నిన్న ఒకరు ప్రకటించుకున్నారు. ఎవరైనా తనకుతాను అలా ప్రకటించుకుంటారా? ఇది ముమ్మాటికీ అహంకారమే' అని అన్నారు. ఇలాంటి వాళ్లను దేశ ప్రజలు అస్సలు అంగీరించరని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ పరిణితి లేని వాడని, కనీస గౌరవ మర్యాదలు కూడా ఆయనకు తెలియవని ప్రధాని విమర్శించారు. దేశానికి గర్వకారణమైనటువంటి కర్ణాటక ప్రతిష్టను గత ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ  దారుణంగా దెబ్బతీసిందని ఆరోపించారు. కాంగ్రెస్ సంసృతి, మతం, జాతి, నేరాలు, అవినీతి, కాంట్రాక్టర్ల వ్యవస్థ..  వంటి ఆరో రోగాలతో  కాంగ్రెస్ పార్టీ కాలం గడుపుతోదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి దిల్ (హృదయం) లేదని.. వారు 'డీల్స్‌'తోనే పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు.