'బాపూ'ని అవమానించినందుకు ప్రజ్ఞా ఠాకూర్ ని ఎప్పటికీ క్షమించను

'బాపూ'ని అవమానించినందుకు ప్రజ్ఞా ఠాకూర్ ని ఎప్పటికీ క్షమించను

జాతిపిత మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలకు సాధ్వీ ప్రజ్ఞా క్షమాపణలు కోరినప్పటికీ తాను ఆమెను ఎప్పటికీ క్షమించబోనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం స్పష్టం చేశారు. ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'గాంధీజీ లేదా గాడ్సే గురించి చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. సమాజానికి తప్పుడు సందేశం ఇచ్చేవిగా ఉన్నాయి. ఆమె క్షమాపణ కోరడం వేరే విషయం. కానీ నేను మనస్ఫూర్తిగా ఆమెను ఎప్పటికీ క్షమించలేనని' చెప్పారు.


మే 19న దేవాస్ లోక్ సభ స్థానానికి జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మహేంద్ర సోలంకీకి మద్దతుగా ఆగర్ మాల్వాలో రోడ్ షో జరుపుతున్న ప్రజ్ఞా గురువారం స్థానిక న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా 'నాథూరామ్ గాడ్సే దేశభక్తుడు. గాడ్సేని ఉగ్రవాది అనే వాళ్లు తమని తాము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ సారి ఎన్నికల్లో అలా అనేవాళ్లకి జవాబు చెప్పబోతున్నాం' అన్నారు.

ప్రధానమంత్రి ఇంత బలంగా స్పష్టంగా ప్రకటన రావడం చూస్తే బీజేపీ తమ పార్టీకే చెందిన ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలపై ఎంత సీరియస్ అయిందో అర్థం అవుతోంది. కొన్ని గంటల ముందు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వరుస ట్వీట్లతో సాధ్వీ ప్రజ్ఞాను వెనక్కి తగ్గాల్సిందిగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్రజ్ఞా ఠాకూర్, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్దేల పేర్లు ప్రస్తావిస్తూ వారి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వారిపై చర్యలు తప్పవని షా హెచ్చరించారు.