ఐసీజే తీర్పుపై మోడీ హర్షం..

ఐసీజే తీర్పుపై మోడీ హర్షం..

కుల్‌భూషణ్‌ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ... ఐసీజే తీర్పుపై సోషల్ మీడియాలో స్పందించిన ఆయన... అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. న్యాయమూర్తులు వాస్తవాలను లోతుగా అధ్యయనం చేసి ఈ తీర్పు వెలువరించినందుకు అభినందలు.. సత్యం-న్యాయానిదే గెలుపు. కుల్‌భూషణ్‌ జాదవ్‌కు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నానని.. ప్రతీ భారతీయుడి భద్రత, సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తోందని ట్వీట్ చేశారు మోడీ. కాగా, కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్‌ ఆర్మీ కోర్టు విధించిన మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం నిలిపివేసిన సంగతి తెలసిందే. మరణ శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలనీ, అప్పటివరకూ శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం.. పాకిస్థాన్‌కు స్పష్టం చేసింది. జాదవ్‌ వ్యవహారంలో పాక్‌ అనుసరించిన తీరును అడుగడుగునా ఆక్షేపించింది. న్యాయవాదిని నియమించుకునే హక్కు భారత్‌కు ఉందని తేల్చి చెప్పింది. 16 మంది సభ్యుల ధర్మాసనంలో, ఉపాధ్యక్షుడిగా ఉన్న చైనా ప్రతినిధి సహా మొత్తం 15 మంది భారత్‌కు అనుకూలంగా రూలింగ్‌ ఇవ్వడంతో అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది.