ఫిట్‌నెస్ రోజువారీ జీవితంలో భాగం కావాలి..

ఫిట్‌నెస్ రోజువారీ జీవితంలో భాగం కావాలి..

ఫిట్‌నెస్ రోజువారీ జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను యువత గుర్తించాలన్నారు. ఆరోగ్య భారత్ మన లక్ష్యం మని ప్రకటించిన ప్రధాని.. సాంకేతికత, అభివృద్ధి క్రమంగా శారీరక శ్రమను తగ్గించాయన్నారు. దీంతో మనలో చాలా మంది వాకింగ్ చేయడం మానేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. కనీసం రోజుకు 2 వేల అడుగుల దూరం కూడా నడవలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఫిట్‌నెస్‌ను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని  పిలుపునిచ్చారు. 

డైట్ గురించి మాట్లాడడం ఈ రోజు ఫ్యాషన్ అయ్యింది అన్నారు ప్రధాని మోడీ... మనకు అన్ని సౌకర్యాలు ఉన్నా.. ఫిట్‌నెస్‌ను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. జీవన విధానంలో చిన్నమార్పులు ఎంతో ప్రయోజనం చేస్తాయన్న ఆయన.. క్రమంగా అంతా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలన్నారు. ఇప్పుడు మైదానాలను విడిచి.. పిల్లలు సెల్‌ఫోన్లలో ఆటలు ఆడుతున్నారని.. ఈ పద్దతి మారాలన్నారు. ఫిట్‌నెస్ గురించి చెప్పడం కాదు.. చేయాలని సూచించిన ప్రధాని.. ఫిట్‌నెస్‌పై అన్ని పాఠశాలల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంతో క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుదామన్న ఆయన.. క్రీడల్లో ఉన్నతశిఖరాలు అధిరోహించేలా ప్రోత్సహిద్దాం మన్నారు.