బీజేపీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు

బీజేపీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు

లోక్ సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ కి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలు అద్భుతంగా జరిగాయని.. మరోసారి పూర్తి మెజారిటీతో తమ ప్రభుత్వం రానుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు తనను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు చెప్పుకొనేందుకు వచ్చానని మోడీ అన్నారు. ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురైనా దేశం తనకు పూర్తి మద్దతు తెలిపిందని చెప్పారు. ఎన్నికల ప్రచారం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇచ్చిన అవకాశంగా భావించినట్టు తెలిపారు. కొత్త సర్కార్ ఏర్పాటుపై ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని..ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొత్త ప్రభుత్వం తన బాధ్యతలు చేపడుతుందని అన్నారు. ఒక దాని వెంట ఒకటిగా నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ముందుకు నడిపిస్తామని హామీ ఇచ్చారు. చివరి వ్యక్తి వరకు ప్రయోజనం అందజేయడం తమ ప్రభుత్వ ప్రత్యేకతగా మోడీ చెప్పుకున్నారు. ఎంతో శ్రమతో ఇది సాధ్యమైందని ఆయన వివరించారు.

చాలా కాలం తర్వాత రెండోసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడనుందని ప్రధాని మోడీ జోస్యం చెప్పారు. ఎన్నికలు అద్భుతంగా జరిగాయని, ఒక సానుకూల దృక్పథంతో జరిగాయని తెలిపారు. పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకొని మరోసారి గెలవడాన్ని దేశం చాలా కాలం తర్వాత చూడబోతోందన్నారు. గతంలో రెండు సార్లు ఎన్నికలు జరిగినపుడు ఐపీఎల్ నిర్వహించలేదని గుర్తు చేస్తూ ప్రభుత్వం బలంగా ఉన్నపుడు ఐపీఎల్, రంజాన్, స్కూల్ పరీక్షలు, ఇతర కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగిపోతాయని ప్రధాని అన్నారు.

అయితే ప్రధాని మీడియా నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొనలేదు. తనకు వచ్చిన ప్రశ్నలను పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు బదిలీ చేశారు. షా ఆయా ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని ప్రశ్నలను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.