మోడీ నా ప్రియమిత్రుడే.. కానీ..

మోడీ నా ప్రియమిత్రుడే.. కానీ..

ప్రధాని నరేంద్ర మోడీ నా ప్రియమిత్రుడు అని తెలిపారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్... విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ నా ప్రియమిత్రుడే... కానీ, ఆయన తిరిగి ప్రధాని కావడం పగటికలే అన్నారు. నరేంద్ర మోడీ సెక్యులరిజం పేరుతో అధికారంలోకి వచ్చి కమ్యునలిజం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన పాల్... రాష్ట్రంలో టీడీపీ, వైసీపీని గెలిపిస్తే... బీజేపీ గెలిచినట్టే అన్నారు. మరోవైపు ఏపీలో టీడీపీ, వైసీపీ భూస్థాపితం కాబోతున్నాయని వ్యాఖ్యానించారు. అవినీతిని అంతం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 

కపిల్ సిబాల్‌తో కలిసి సేవ్ సెక్యులర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు కేఏ పాల్... వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పార్టీని ఏర్పాటు చేవామన్న ఆయన.. జగన్, చంద్రబాబుకు ఓటువేస్తే ఆర్ఎస్ఎస్, బజరంగదంళ్ కు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. ఇక ప్రజాశాంతి పార్టీలో చేరిన మొదటి 60 వేల మందికి తాము అధికారంలో  వచ్చిన వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు పాల్. ఐదేళ్లలో అమరావతిని హైదరాబాదుకు ధీటుగా తయారు చేస్తామన్న ఆయన... రూ. 7 లక్షల కోట్లు నిధులను విదేశాల నుంచి తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.