మోడీ ప్రమాణస్వీకారానికి ప్రత్యేక ఏర్పాట్లు..

మోడీ ప్రమాణస్వీకారానికి ప్రత్యేక ఏర్పాట్లు..

భారత ప్రధానిగా రెండోసారి నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ (నరేంద్ర మోడీ) సిద్ధమయ్యారు. ఇవాళ రాత్రి 7 గంటలకు కొత్త మంత్రులతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. దీనికోసం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ ముందు ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యకరమానికి దాదాపు 8 వేల మంది అతిథులు హాజరుకానున్నారు. ప్రధానమంత్రితో పాటు, కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అయితే, రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ప్రమాణస్వీకారోత్సం నిర్వహిస్తూ ఉంటారు. ఈ సారి మరింత అట్టహాసంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో రాష్ట్రపతి భవన్‌ ముందున్న బహిరంగ ప్రాంతంలోకి వేదికను మార్చారు. ఇక మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి అతిరథ మహారథులు తరలిరానున్నారు. మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జగన్నాథ్‌, కిర్గిజ్‌ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్‌, బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్‌, శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన, నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి, మయన్మార్‌ అధ్యక్షుడు యు విన్‌ మైంట్‌, భూటాన్‌ ప్రధాని లోటయ్‌ సెరింగ్‌, థాయ్‌లాండ్‌ ప్రత్యేక దూత గ్రిసాద బూన్‌రాచ్‌లు హాజరుకానున్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. పెద్దసంఖ్యలో వీఐపీలు తరలివస్తుండడంతో భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. వీఐపీల తాకిడి కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు.