ప్రగ్యా సింగ్ థాకూర్‌కు మోడీ అనూహ్య మద్దతు..!

ప్రగ్యా సింగ్ థాకూర్‌కు మోడీ అనూహ్య మద్దతు..!

ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే మృతిపై భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన ప్రగ్యా సింగ్ థాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హేమంత్ క‌ర్క‌రే త‌న శాపం వ‌ల్లే ఉగ్రవాదుల చేతుల్లో మృతిచెందాడంటూ ప్రగ్యా సింగ్ వ్యాఖ్యానించడంపై రాజకీయ విమర్శలు పెరగడంతో పాటు.. ఐపీఎస్‌ అసోసియేషన్ కూడా ఖండించింది. అయితే, తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో  ప్రగ్యా సింగ్ థాకూర్ వెనక్కి తగ్గారు. తాను పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశానని, తాను అన్నమాటల్ని వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. కానీ, ప్ర‌ధాని నరేంద్ర మోడీ మాత్రం .. ప్రగ్యాకు మద్దతుగా నిలిచారు. హిందూ నాగ‌రిక‌త‌పై ఉగ్రవాదం మ‌చ్చ వేసిన కాంగ్రెస్ నేత‌ల‌కు ప్రగ్యానే స‌మాధానంగా నిలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు మోడీ. త‌ప్పుడు ప‌ద్ధ‌తిలో హిందూ సంస్కృతిని కాంగ్రెస్ నేత‌లు కించ‌ప‌రిచారని.. కాంగ్రెస్ పార్టీ కొన్ని ల‌క్ష్యాల‌తో త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ద‌ని, సంజౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు, జ‌డ్జి బీహెచ్ లోయా మృతి లాంటి కేసుల‌ను బీజేపీకి అంట‌గ‌ట్టింద‌న్నారు. బెయిల్‌పై ఉన్న ప్రగ్యాను సమర్థిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు కూడా బెయిల్‌పైనే ఉన్నార‌ని, మ‌రి వారిని ఎందుకు పోటీకి దూరంగా ఉంచ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు ప్రధాని.

ప్రగ్యాను హేయంగా అవమానించారని మండిపడ్డారు ప్రధాని నరేండ్ర మోడీ... ప్రగ్యా ఓ మ‌హిళ, అది కూడా ఆమె సాధ్వి, అలాంటి వ్య‌క్తిని చాలా హేయంగా అవ‌మానించార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజౌత ఎక్స్‌ప్రెస్ కేసులో హిందూ ఉగ్ర‌వాదం అంటూ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని, కాంగ్రెస్ వాళ్లు 5 వేల ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన మ‌న నాగ‌రిక‌త‌ను అవ‌మానించార‌ని వ్యాఖ్యానించారు. ప్రధాని ఇందిరా గాంధీ హ‌త్య అనంత‌రం చోటుచేసుకున్న సిక్కుల ఊచ‌కోత ఉగ్ర‌వాదం కాదా అని మోదీ ప్ర‌శ్నించారు. ఓ పెద్ద చెట్టు కూలితే భూమి కంపిస్తుంద‌ని రాజీవ్ గాంధీ అన్నార‌ని, ఆ త‌ర్వాత ఢిల్లీలో వేల మంది సిక్కుల‌ను హ‌త‌మార్చార‌ని, మ‌రి అది ఉగ్ర‌వాదం కాదా అంటూ ఎదురుదాడికి దిగారు మోడీ. అయితే, ప్రగ్యా సింగ్ వెనక్కి తగ్గినా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం... ప్రగ్యాను వెనుకేసుకురావడం చర్చనీయాంశంగా మారింది.