ప్రధాని మోడీకి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు

ప్రధాని మోడీకి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి న్యూఢిల్లీలో సోమవారం మొట్టమొదటి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు ప్రదానం చేశారు. ‘పీపుల్, ప్రాఫిట్, ప్లానెట్’ అనే మూడు అంశాల ఆధారంగా ఈ పురస్కారం అందజేసినట్టు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ పురస్కారాన్ని ప్రతి ఏడాది ఏదైనా దేశ నేతకు ప్రదానం చేస్తారు. పురస్కార ప్రశంసాపత్రంలో నరేంద్ర మోడీని ‘దేశానికి ఉత్కృష్ఠ నాయకత్వం’ వహిస్తున్నందుకు ఎంపిక చేసినట్టు పేర్కొంది. ‘దేశం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న మోడీ సేవలు.. నిరంతరం దేశం కోసం కష్టపడుతున్న తీరు దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా ప్రగతి పథం వైపు నడిపిస్తున్నాయి. ఆయన నాయకత్వంలో భారత్ ఇప్పుడు ఆవిష్కరణ కేంద్రంగా మారిందని, విలువ ఆధారిత ఉత్పత్తి (మేకిన్ ఇండియా), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అకౌంటింగ్, ఫైనాన్స్ వంటి నైపుణ్య సేవలకు ప్రపంచ కేంద్రంగా ఉందని’ ప్రశంసించింది.

మోడీ పాలనలో ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్వచ్చ్ భారత్ వంటి పథకాలు ప్రపంచ మాన్యుఫాక్చరింగ్, బిజినెస్ రంగాల్లో భారత్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయని ఫిలిప్ కోట్లర్ అవార్డ్ ఆర్గనైజర్స్ తెలిపారు. కాగా, నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గా చేసిన 'ఫిలిప్ కోట్లర్' పేరు మీదుగా ఈ అవార్డును అందజేస్తున్నారు.