ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం ఒక్కటి కావాలి...మోడీ పిలుపు

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం ఒక్కటి కావాలి...మోడీ పిలుపు


అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ..న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి 74వ జనరల్‌ అసెంబ్లీలో మాట్లాడారు. ఎప్పటిలాగే ఉగ్రవాదం అంశాన్ని ప్రస్తావించిన ఆయన ప్రపంచ దేశాలను దృష్టిలో పెట్టుకునే ప్రసంగించారు. పాకిస్థాన్‌ పేరు ఎత్తకుండానే.. టెర్రరిజం వల్ల ఆయా దేశాల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఒక్క మాటలో పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవాళి వినాశమే కోరుకుంటోందని.. అందరికీ సవాల్‌ విసురుతోందని, అందుకే మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకుని తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఒక్కటి కావాలన్నారు ప్రధాని.

ప్రపంచ పీస్‌ మిషన్‌లో అత్యధిక మంది జవాన్లను కోల్పోయిన దేశం భారతేనని గుర్తు చేశారు. మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకుని తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఒక్కటి కావాలని పిలుపిచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఏదో ఒక దేశానికి ఉగ్రవాదం సవాల్‌ విసరడం లేదని.. చాలా దేశాలు బాధితులేనని చెప్పారాయన. ప్రపంచ దేశాలకు యుద్ధం కాకుండా బుద్ధుడిని, శాంతి సందేశాన్ని అందించిన ఏకైక దేశం భారతేనని వెల్లడించారు మోడీ.

చికాగాలో వందేళ్ల క్రితమే వివేకానందుడు చెప్పిన విషయాలు నేటికీ ప్రపంచానికి ఆచరణీయమని చెప్పారాయన. గ్లోబల్‌ వామింగ్‌ విషయంలో తమ పాత్ర చిన్నదైనా.. చర్యలు తీసుకోవడంలో భారత్ అగ్ర దేశంగా ఉందన్నారు ప్రధాన మంత్రి. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌  నిషేధానికి భారత్‌ తీసుకుంటున్న చర్యలను ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు వివరించారు ప్రధాని మోడీ. దేశంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఐక్యరాజ్యసమితి బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారాయన.