రేపు 25 లక్షల మంది చౌకీదార్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

రేపు 25 లక్షల మంది చౌకీదార్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

మార్చి 13న ప్రధానమంత్రి ప్రారంభించిన 'మై భీ చౌకీదార్' ప్రచారానికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. మై భీ చౌకీదార్ ప్రచారం భారీస్థాయిలో విజయవంతం కావడంతో బీజేపీలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఈ ఒరవడిని కొనసాగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు కొత్తగా చౌకీదార్లయినవారిలో కొందరిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలకరించబోతున్నారు. ఈ వివరాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇవాళ తెలియజేశారు.

'మై భీ చౌకీదార్' ప్రచారం సోషల్ మీడియాను ఉప్పెనలా ముంచెత్తిందని మంత్రి అన్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ ని 20 లక్షలకు పైగా ట్వీట్ చేయడం జరిగిందని, 1,680 కోట్ల ఇంప్రెషన్లు రావడం చూస్తే ఇది ప్రజా ఉద్యమంగా మారినట్టు స్పష్టమవుతోందని చెప్పారు. 

ప్రధానమంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్ లో పేరుకి ముందు చౌకీదార్ అని చేర్చుకోవడం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పెను సంచలనంగా మారింది. ప్రధాని మంత్రివర్గ సహచరులు, పార్టీ నేతలు, అభిమానులు తమ పేరు ముందు చౌకీదార్ అని చేర్చుకుంటే ప్రతిపక్షం దానిని ఖండించేందుకు ముందుకు ఉరికింది.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా మొదలు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల నేతలంతా ఈ ప్రచారంపై విమర్శల వర్షం కురిపించారు. పాటిదార్ వర్గానికి కోటా ఆందోళనతో వార్తల్లోకి ఎక్కిన హార్దిక్ పటేల్ దీనికి పోటీగా మరో ప్రచారం ప్రారంభించారు. హార్దిక్ పటేల్ తన పేరుకి ముందు బేరోజ్ గార్ అని పెట్టుకున్నారు. దీనికి కూడా ట్విట్టర్ లో వేగంగా ప్రతిస్పందన వచ్చింది. 

2014 ఎన్నికలకు ముందు అవినీతిపై తన పోరాటం గురించి చెబుతూ ప్రధాని మోడీ వాడిన చౌకీదార్ పదంతో కాంగ్రెస్ కొన్నాళ్లుగా ఆయనను వెటకారం చేస్తోంది. దీనిని ఎదుర్కొనేందుకు బీజేపీ 'మై భీ చౌకీదార్' ప్రచారం ప్రారంభిచింది. ఏడాది నుంచి రాహుల్ గాంధీ 'చౌకీదార్ చోర్ హై' అనే నినాదాన్ని రఫెల్ ఫైటర్ జెట్ డీల్ లో అవినీతి, ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రధాని మోడీ పెంచి పోషిస్తున్నారని ఆరోపించినప్పుడల్లా ఉపయోగిస్తూ వస్తున్నారు.