ప్రపంచం చుట్టేసే ప్రధానికి వారణాసిలోని గ్రామాలు చూసే తీరిక లేదా?

ప్రపంచం చుట్టేసే ప్రధానికి వారణాసిలోని గ్రామాలు చూసే తీరిక లేదా?

ఈ ఐదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన నియోజకవర్గమైన వారణాసిలోని కనీసం ఒక్క గ్రామంలో పర్యటించేందుకు సమయం చిక్కలేదా అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నించారు. వచ్చే నెల జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో ర్యాలీ నిర్వహించారు.

'ఈ ఐదేళ్లలో కనీసం ఒక్కసారైనా ప్రధాని వారణాసిలోని ఒక్క గ్రామానికైనా వెళ్లే తీరిక లేదని ప్రజలు చెప్తే నేను నిశ్చేష్టురాలినయ్యాను. తన నియోజకవర్గంలో కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా ఆయన పలకరించలేదని' ప్రధాని మోడీ, ఆయన ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ప్రియాంక గాంధీ తూర్పారబట్టారు. 'ఆయన అమెరికా, జపాన్, చైనా, ప్రపంచం అంతా చుట్టేశారు. కానీ తన సొంత నియోజకవర్గ ప్రజలను కలుసుకొనేందుకు మాత్రం ఆయనకు తీరుబడి లేదు. మిగతా దేశప్రజల సంగతి తర్వాత..కనీసం తన సొంత నియోజకవర్గ ప్రజలకు ఆయన ఏమీ చేయలేదు. ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా పెద్ద సంగతి. ఇది ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. ధనికులని మరింత ధనవంతులుగా చేయడంపైనే దృష్టి పెట్టి పేదలకు సాయం చేయడం లేదు' అని ప్రియాంక మండిపడ్డారు.

బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని 'జనతా విరోధి', 'కిసాన్ విరోధి' అని దుమ్మెత్తిపోశారు. ఒక ప్రణాళిక ప్రకారం అన్ని వ్యవస్థలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ పని చేస్తోందని ప్రియాంక వాద్రా ఆరోపించారు. 'మీరు ఎవరికి ఓటేశారో గట్టిగా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని' ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.

తన మూడు రోజుల ప్రచారంలో చివరి రోజైన ఇవాళ ప్రియాంక అయోధ్య, ఫైజాబాద్ లలో పర్యటిస్తున్నారు. మొదటి రోజు తన సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథీలో, రెండో రోజు తన తల్లి, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయ్ బరేలీలో ప్రియాంక వాద్రా పర్యటించారు.