రాహుల్ గాంధీ, విరాట్ కోహ్లీ, కరణ్ జోహార్, ఖాన్ లకు ప్రధాని ట్వీట్

రాహుల్ గాంధీ, విరాట్ కోహ్లీ, కరణ్ జోహార్, ఖాన్ లకు ప్రధాని ట్వీట్

లోక్ సభ ఎన్నికలకు తేదీలు ప్రకటించగానే ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. రాజకీయ పార్టీల మధ్య దాడి-ఎదురుదాడి జోరుగా సాగుతోంది. ఈ మధ్యలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రతర్థి పార్టీల నేతలకు ఓ అప్పీల్ చేశారు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, శరద్ పవార్, మాయావతి, అఖిలేష్ యాదవ్, ఎంకె స్టాలిన్ లను ట్యాగ్ చేస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అందులో ‘రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా ఓటర్లు ఓట్ చేసేందుకు ప్రోత్సహించండి. ప్రజలు ఎంత ఎక్కువ మంది పోలింగ్ లో పాల్గొంటే మన ప్రజాస్వామ్యానికి అంత శుభ సూచకం.‘ అని పేర్కొన్నారు. ప్రధాని రాజకీయం, వ్యాపారం, వినోదం, క్రీడలు, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఓటర్లను ఓటింగ్ చేసేలా ప్రేరేపించేందుకు సాయపడాల్సిందిగా కోరారు.

ఈ వరుసలో ప్రధాని మోడీ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలకు కూడా ప్రజలు పోలింగ్ బూత్ లకు తరలివచ్చేందుకు పిలుపునివ్వాల్సిందిగా కోరారు. తమ అధికారాల గురించి ప్రజల్లో అవగాహన పెరిగినపుడే భారతదేశం బలోపేతం అవుతుందన్నారు.

ప్రజలను జాగరూకులను చేయాలని నితీష్ కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్, పవన్ చామ్లింగ్ లకు కూడా ప్రధాని అప్పీల్ చేశారు.

యువతకు వారి అధికారాల గురించి వివరించి చెప్పి ఓట్ వేసేలా చూడాలని హర్ సిమ్రత్ బాదల్, చిరాగ్ పాశ్వాన్, ఆదిత్య ఠాక్రేలను ప్రధాని కోరారు.

‘చాలా మంది యువకులు మిమ్మల్ని అభిమానిస్తారు. వారికి చెప్పాల్సిన సమయం వచ్చింది: అప్నా టైమ్ ఆ గయా హై. వారి దగ్గరలో ఉన్న ఓటింగ్ సెంటర్ కి హై జోష్ తో వెళ్లాల్సిన సమయం‘ అని రణ్ వీర్ సింగ్ (గల్లీ బాయ్), విక్కీ కౌషల్ (ఉరి) లను ట్యాగ్ చేశారు. ‘ప్రజల గొంతు వినిపించేందుకు ఓటు ఒక గొప్ప మార్గం‘ అని లెజెండరీ గాయని లతా మంగేష్కర్, ఏఆర్ రెహమాన్ లకు ట్వీట్ చేశారు. 

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఫోగట్ సోదరీమణులకు కూడా వేర్వేరుగా ప్రధాని ట్వీట్లు పెట్టారు. మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ లను కూడా ట్యాగ్ చేశారు.