నీరవ్ మోడీ భార్యపై నాన్ బెయిలబుల్ వారంట్

నీరవ్ మోడీ భార్యపై నాన్ బెయిలబుల్ వారంట్

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ భార్య అమీ మోడీపై ముంబైలోని ఒక ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. నీరవ్ మోడీ 2 బిలియన్ డాలర్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడు.

ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసు విచారణ చేపట్టిన ఒక ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎం ఎస్ ఆజ్మీ నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. నీరవ్ మోడీ, ఇతర నిందితులకు వ్యతిరేకంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొద్ది రోజుల క్రితం కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. 

అమీ మోడీ మూడు కోట్ల డాలర్లను తరలించేందుకు అంతర్జాతీయ బ్యాంకు ఖాతా ఉపయోగించినట్టు ఈడీ ఆరోపించింది. ఈ డబ్బు కుంభకోణం ద్వారా ఆర్జించిందేనని అనుమానిస్తున్నారు.

ఈ డబ్బుని ఉపయోగించి న్యూయార్క్ లోని సెంట్రల్ పార్కులో ఉన్న ఆస్తిని కొనుగోలు చేసినట్టు ఈడీ తెలిపింది. ఏజెన్సీ తన ఆరోపణ పత్రంలో ఈ కేసులో సేకరించిన ఇతర సాక్ష్యాధారాలు, కీలక వివరాలను పేర్కొంది. ఈ కుంభకోణంలో ఆమీ మోడీ పాత్ర, ఆమె ద్వారా డబ్బుని అటు ఇటు తరలించిన తీరుని ఈడీ అనుబంధ ఆరోపణ పత్రంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఈడీ మొదటి చార్జిషీటును గత ఏడాది మేలో దాఖలు చేసింది.