కలకలం సృష్టిస్తున్న పనామా లీక్స్‌ 2

కలకలం సృష్టిస్తున్న పనామా లీక్స్‌ 2

రెండేళ్ళ క్రితం కలకలం సృష్టించిన పనామా లీక్స్‌ ఇవాళ మళ్ళీ దేశ రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.  వరుస లీక్స్‌తో  అక్రమార్కులను గడగడలాడించిన   ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ (ఐసీఐజే),  జర్మన్‌ పత్రిక సుడెషె జుటెంగ్‌లు తాజా జాబితాను విడుదల చేశాయి. గతంలోనూ ఈ రెండు సంస్థలు పలు లీక్స్‌ను విడుదల చేశాయి. సుమారు 12 లక్షల కొత్త డాక్యుమెంట్లను ఈసారి విడుదల చేశారు. ఈ మొత్తం పరిశోధనల్లో మన దేశం నుంచి పాలు పంచుకుంటున్న ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. తాజా జాబితాలో భారతీయులకు చెందిన 12000 పత్రాలు  ఉన్నట్లు సమాచారం. వీరికి సంబంధించిన వివరాలను  శుక్రవారం నాటి సంచికలో ప్రచురిస్తామని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించింది. 

నల్లధన స్వర్గధామాలు విరాజిల్లుతున్న దేశాల్లో  డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి నల్లధనాన్ని తరలించిన అనేక కంపెనీ భాగోతాలను పనామా లీక్స్‌ బహిర్గతం చేసింది. అయితే తాము సమీకరించిన డేటాను మాత్రమే బహిర్గతం చేస్తున్నామని... ఇందులో పేర్కొన్నవారందరూ నల్లధన కుబేరులు కాదని... నిబంధనల ప్రకారం సొమ్ము దాచుకునేవారు కూడా ఉండొచ్చని ఐసీఐజే పేర్కొంది
పెద్దల జాబితా
ఇవాళ విడుదల చేసిన  పనామా లీక్స్‌ -2లో భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ యజమాని సునీల్‌ మిట్టల్‌ కుమారుడు కెవిన్‌ సునీల్‌ మిట్టల్‌కు చెందిన పలు కంపెనీల వివరాలను ఐసీఐజే వెల్లడించింది. పీవీఆర్‌ సినిమా కంపెనీ ఛైర్మన్‌ అజయ్‌ బిజ్లి, ఏషియన్‌ పెయింట్స్‌ ప్రమోటర్‌ ఆశ్విన్‌ డాని కుమారుడు జలజ్‌ అశ్విన్‌ డాని పేరు కూడా పనామా లీక్స్‌లో ఉంది. తాజా జాబితాలో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2016లో వెల్లడైన జాబితాలో బయటపడిన యజమానులు, వారి కంపెనీల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా బయటపడ్డాయి. నల్లధన స్వర్గధామాల్లో నెలకొల్పిన కంపెనీలను మూసేయాలని కొందరు సూచించగా.. కొందరు కొనసాగించేందుకు ఇష్టపడ్డారు. 2016లో పనామా లీక్స్‌లో బయటపడిన పేర్లలో అమితాబ్ బచ్చన్‌,  జెహంగీర్‌ సొరాబ్జి, డీఎల్‌ఎఫ్‌ గ్రూప్‌, శివ ఖెమ్కాపేర్లు ఉన్నాయి.