రివర్స్ టెండరింగ్ మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆసక్తికర వ్యాఖ్యలు !

రివర్స్ టెండరింగ్ మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆసక్తికర వ్యాఖ్యలు !

పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దుపై పోలవరం అథారిటీ స్పందించింది. హైదరాబాద్‌ లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్వహించిన అత్యవసర సమావేశం అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్‌ ఆర్‌.కె.జైన్‌ మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు పూర్తి చేసే సమయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రివర్స్ టెండరింగ్ తో ఎంత ఖర్చు పెరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని, కాంట్రాక్టు ఏజెన్సీల పనితీరు తమకైతే సంతృప్తికరంగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు. సుమారు ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం టెండర్ల రద్దుపై చర్చ జరిగింది.

ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం ఎలా కొనసాగింది? ఆర్‌ అండ్‌ ఆర్‌ అమలు తదితర అంశాలపై సమీక్షించిన అధికారులు పనులు ఆపేయాలంటూ కాంట్రాక్టర్ కి ఏపీ ప్రభుత్వం నోటీసులు, రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్ళే క్రమంలో ఉండే లాభనష్టాలపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది. ఈ సమావేశానికి  కేంద్ర జల సంఘం అధికారులు, ఏపీ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నిర్ణయమని పీపీఏ ఛైర్మన్‌ ఆర్కే జైన్ పేర్కొన్నారు. ఈ విధానం వల్ల రెండు అంశాలపై ప్రభావం పడుతుందని, రివర్స్ టెండరింగ్ వలన ఇబ్బందులు వస్తాయని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులకు సూచించామని కూడా ఆయన పేర్కొన్నారు. పోలవరం వరద ముంపు పై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. వరద తగ్గుముఖం పట్టిన తరువాత పునరావాస భాదితులకు సరైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు,