'పోలవరం' పనుల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు

'పోలవరం' పనుల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు

పోలవరం ప్రాజెక్టు పనులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. 24 గంటల్లో 32,100 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ ను డంప్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం వరకు పనులు కొనసాగించి కాంక్రీట్ వేయడం ద్వారా ఇప్పట్లో ఎవరూ ఈ రికార్డును అధిగమించకుండా ఉండేలా చేయాలన్నది ప్రాజెక్టు అధికారుల ఆలోచన. పోలవరంలో రికార్డు కాంక్రీటు పనులు గత 17వ తేదీనే చేపట్టాలని నిర్మాణ సంస్థ నవయుగ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే పెథాయ్‌ తుపాను రావడంతో పనులను వాయిదా వేశారు. నిత్యం జరిగే 15 వేల ఘనపు మీటర్ల కాంక్రీటు పనులు యథావిధిగా సాగిస్తున్నారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు అధికారులు ఆదివారం సమయం ఇవ్వడంతో గత నాలుగు రోజుల నుంచి అదనపు కాంక్రీటు పనులకు సంబంధించిన ఏర్పాట్లలో నిర్మాణ సంస్థ, ప్రాజెక్టు అధికారులు నిమగ్నమయ్యారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పనులు ప్రారంభం కాగా.. 9 గంటల వరకు తొలిగంటకు 1275 ఘ.మీ. కాంక్రీటు వేశారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నవయుగ నిర్మాణ సంస్థ ఎండీ కె.శ్రీధర్‌ ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్షిస్తున్నారు. గిన్నిస్‌ బుక్‌ రికార్డ్సుకు సంబంధించి 24 మంది ఇంజినీర్లతో కూడిన బృందం పనులను పరిశీలించింది. 

గిన్నిస్‌ రికార్డుపై సీఎం హర్షం
పోలవరం పనుల్లో గిన్నిస్‌ రికార్డుపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. నవయుగ ఇంజినీరింగ్‌ ఎండీ శ్రీధర్, ప్రభుత్వ అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. పోలవరంలో గిన్నిస్‌ రికార్డు సాధించడం గర్వకారణమని సీఎం అన్నారు. ఇదో భగీరథ ప్రయత్నం..పోలవరం నిర్మాణం మహాయజ్ఞమని ఆయన అన్నారు.

24 గంటల్లో వేసిన కాంక్రీటు (క్యూ.మీ)
మొదటి గంట 1275 
రెండో గంట 1340
మూడో గంట 1380 
నాలుగో గంట 1420
ఐదో గంట 1382 
ఆరో గంట 1397 
ఏడో గంట 1417
ఎనిమిదో గంట 1385
తొమ్మిదో గంట 1300
10వ గంట 1396 
11వ గంట 1415 
12వ గంట 1477
13వ గంట 1345
14వ గంట 1350
15వ గంట 1480
16వ గంట 1286 మొత్తం 22, 045 క్యూబిక్ ప్రపంచ రికార్డ్ బ్రేక్
17వ గంట 1257 
18వ గంట 1275 
19వ గంట 1255
20వ గంట 1265

21వ గంట 1260

22వ గంట 1287

23వ గంట 1267

24వ గంట 1189