రవి ప్రకాష్‌, శివాజీకి పోలీసుల నోటీసులు..

రవి ప్రకాష్‌, శివాజీకి పోలీసుల నోటీసులు..

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌, హీరో శివాజీకి నోటీసులు ఇచ్చారు పోలీసులు... రవిప్రకాష్‌ ఇంటికి  వెళ్లిన పోలీసుల బృందం.. ఆయన అందుబాటులో లేకపోవడంతో రవి ప్రకాష్ భార్యకు 160 సీఆర్‌పీసీ నోటీసులు అందజేశారు. రేపు తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. ఇక రవి ప్రకాష్‌తో పాటు హీరో శివాజీ కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. కాగా, రవి ప్రకాష్‌తో పాటు హీరో శివాజీపై అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు... ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బీ, ఐటీ యాక్ట్ 66, 72  కింద కేసు నమోదు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. టీవీ9ను కొనుగోలు చేసిన అలంద మీడియాకు అప్పగించినట్లు ఒప్పందం జరిగినా డైరెక్టర్ల నియామకానికి అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేశారు. టీవీ9లో 90 శాతానికి పైగా అలంద మీడియాకు వాటా ఉండగా.. రవిప్రకాష్‌కు 8 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఒప్పందం సమయంలో ఇచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీ పత్రాలని గుర్తించిన అలందా మీడియా... పోలీసులకు ఫిర్యాదు చేసింది. రవి ప్రకాష్, శివాజీ ఇద్దరు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మమ్మల్ని మోసం చేసి డైరెక్టర్ల నియామకాన్ని అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రవి ప్రకాష్‌ నివాసంతో పాటు... హీరో శివాజీ నివాసంలోనూ పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి నుంచి 7 ప్రత్యేక బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. ఓవైపు పోలీసుల సోదాలు కొనసాగుతోన్న సమయంలోనే టీవీ9 యాజమాన్యం.. రవిప్రకాష్‌ను సీఈవో పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. టీవీ9లో 90 శాతం వాటా కొనుగోలు చేసిన అలంద మీడియా.. యాజమాన్యం చేతులు మారడంతో నలుగురు డైరెక్టర్లను నియమించేందుకు ప్రయత్నించింది. ఈ మేరకు కేంద్ర సమాచారశాఖ అనుమతి కూడా పొందింది. మరోవైపు పోలీసుల సోదాల్లో టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.