మిస్సింగ్ లపై అసత్యప్రచారం, ముగ్గురు అరెస్ట్

మిస్సింగ్ లపై అసత్యప్రచారం, ముగ్గురు అరెస్ట్

తెలంగాణలో మిస్సింగ్‌ల వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తున్న తెలంగాణ యువ సైన్యం ఫేస్‌ బుక్ పేజీ అడ్మిన్‌ఫై కేసు నమోదు చేసి వెంకట్, బాలరాజు, క్రాంతి కిరణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మహిళలు, పిల్లలు అపహరణకు గురౌతున్నారంటూ తెలంగాణలో దుష్ప్రచారం జరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సూచించిన సంగతి తెలిసిందే. మిస్సింగ్ కేసులలో చాలావరకు కుటుంబం, ప్రేమ వ్యవహారం, పరీక్షల్లో ఫెయిలవడం, పిల్లలు తల్లిదండ్రులపై అలిగి వెళ్లిపోవడం, కుటుంబ సభ్యుల సంరక్షణ దొరకక తల్లిదండ్రులు వెళ్లిపోవడం వంటి కారణాల వల్ల నమోదౌతున్నాయని తెలిపారు. మిస్సింగ్ కేసులలో 85 శాతానికి పైగా ట్రేస్ చేశామని, మిగతావి ట్రేస్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజలలో భయాందోళనలు సృష్టించే విధంగా పుకార్లను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపింప చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.