టీవీ9 సీఈవో రవిప్రకాష్‌ ఇంట్లో పోలీసుల సోదాలు..

టీవీ9 సీఈవో రవిప్రకాష్‌ ఇంట్లో పోలీసుల సోదాలు..

టీవీ9 సీఈవో రవిప్రకాష్ ఇంటితో పాటు.. టీవీ9 కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు పోలీసులు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు.. రవిప్రకాష్‌పై ఫిర్యాదు చేశారు. దాంతోపాటు సంస్థకు చెందిన నిధులను కూడా దారి మళ్లించారని రవిప్రకాష్‌పై ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... టీవీ9 కార్యాలయంతో పాటు రవిప్రకాష్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. సోదాల సమయంలో రవిప్రకాష్ ఇటు టీవీ9 కార్యాలయంలోనూ.. తన నివాసంలోనూ అందుబాటులో లేరు. మరోవైపు సోదాల సమయంలో టీవీ 9 కార్యాలయంలో కొన్ని ఫైళ్లు, ల్యాప్ ట్యాప్, హార్డ్ డిస్క్‌లు మాయం అయినట్టు పోలీసులు గుర్తించారు.

టీవీ9 సీఈవో రవి ప్రకాష్‌తో పాటు హీరో శివాజీపై అలందా మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు... ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బీ, it యాక్ట్ 66, 72  కింద కేసు నమోదు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. టీవీ9ను కొనుగోలు చేసిన అలందా మీడియాకు అప్పగించినట్లు ఒప్పందం జరిగినా డైరెక్టర్ల నియామకానికి అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేశారు. టీవీ9లో 91 శాతం అలందా మీడియాకు వాటా ఉండగా.. రవిప్రకాష్‌కు 8.5 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఒప్పందం సమయంలో ఇచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీ పత్రాలని గుర్తించిన అలందా మీడియా... పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తనకు 40 వేల షేర్లు టీవీ9లో ఉన్నాయని, తనకు తెలియకుండా అలందాకు విక్రయించారని శివాజీ ఆరోపించారు. అయితే, రవి ప్రకాష్, శివాజీ ఇద్దరు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మమ్మల్ని మోసం చేసి డైరెక్టర్ల నియామకాన్ని అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అలందా డైరెక్టర్ కౌశిక్ రావు. ఇక టీవీ9 ఆఫీసు, సీఈవో రవి ప్రకాష్‌ నివాసంతో పాటు... హీరో శివాజీ నివాసంలోనూ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి.