ఖైరతాబాద్ గణేష్ కు భారీ బందోబస్తు

ఖైరతాబాద్ గణేష్ కు భారీ బందోబస్తు

ఖైరతాబాద్ లో ప్రతి యేటా కొలువుదీరే భారీ వినాయకుడు.. దేశంలో జరిగే గణేశ్ నవరాత్రి ఉత్సవాల కంటే ప్రత్యేకమైంది. దశాబ్ధాలుగా భారీకాయంతో... విభిన్న రూపాలతో కొలువుదీరుతూ.. భక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ సారి కూడా లక్షలాదిగా భక్తులు దర్శనానికి తరలిరానుండటంతో భద్రతా పరంగా పోలీసులు గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం కంటే అదనపు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ గణపతి వద్ద ప్రత్యేకంగా ఒక డీఎస్పీ, నలుగురు సీఐలు, 18 మంది ఎస్ఐలు, 3 ప్లాటూన్ల సిబ్బంది, 125 మంది కానిస్టేబుల్స్, ఒక ప్లాటూన్ మహిళా కానిస్టేబుల్స్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు 24 గంటల పాటు తనిఖీలు నిర్వహించనున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో 32 సీసీ కెమెరాలు, నిర్వాహకుల ఆధ్వర్యంలో మరో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

భక్తుల అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఆలయ కమిటీ ఖైరతాబాద్ గణపతిని తీర్చిదిద్దుతోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది ‘ శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి’ గా కొలువుదీరనున్నాడు. ఈ భారీ వినాయకుడి ఎత్తు 57 అడుగులు, వెడల్పు 24 అడుగులు. ‘శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి’కి ఏడు తలలు, 14 చేతులు.. తలపై ఏడు సర్పాలు.. కింద ఏడు ఏనుగులు నమస్కరించే రూపంలో ఉంటాయి.. ఈయనకు కుడివైపున 14 అడుగుల ఎత్తులో లక్ష్మీ, ఎడమ వైపున సరస్వతి విగ్రహాలు ఉంటాయి.