విజయవాడ దివ్య హత్యకేసులో పోలీసుల దూకుడు.. నేడో రేపో ?

విజయవాడ దివ్య హత్యకేసులో పోలీసుల దూకుడు.. నేడో రేపో ?

బీటెక్‌ విద్యార్ధిని దివ్య హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. నిందితుడి అరెస్ట్‌పై సందిగ్ధత నెలకొంది. ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన విజయవాడ ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్వి కేసులో నిందితుడు నాగేంద్ర అరెస్ట్‌పై సస్పెన్స్‌ వీడటం లేదు. నాగేంద్ర ప్రస్తుతం గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాదాపు ఆరోగ్యంగానే ఉన్నాడని..పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్‌, పోస్టుమార్టం రిపోర్టులు రావడంతో చార్జ్‌ షీట్‌ను రెడీ చేశారు పోలీసులు. అయితే చట్ట ప్రకారం నాగేంద్రను అరెస్ట్‌ చేశాకే చార్జ్‌షీట్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఇదే కారణంతో నాగేంద్ర అరెస్ట్‌, డిశ్చార్జ్  విషయంలో గోప్యత పాటిస్తున్నారు పోలీసులు. ఇవాళ లేదా రేపు నాగేంద్రను అరెస్ట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. అస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక..అటు నుండి అటే రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే దివ్యది పక్కా హత్యేనని పోలీసులు తేల్చారు. దీనికి సంబంధించిన టెక్నికల్‌ ఆధారాలు కూడా సేకరించారు.  పక్కా స్కెచ్‌ ప్రకారమే దివ్య తేజస్వినిని నాగేంద్ర చంపాడని, పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తోనే మర్డర్‌ చేశాడనే నిజాన్ని  ఫోరెన్సిక్‌, పోస్ట్‌మార్టం నివేదికలు బయటపెట్టాయి.

మరో వైపు దివ్య తేజస్విని హత్య విషయంలో నాగేంద్రతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. దివ్యను మర్డర్‌ చేసే విషయంలో నాగేంద్రకు సహకరించిన వ్యక్తులను కేసు పరిధిలోకి తీసుకువచ్చేలా అడుగులు వేస్తున్నారు పోలీసులు.ఈ కేసుకు సంబంధించి ఇన్‌స్టాగ్రాం, నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్ క్రియేట్‌ చేసిన వారిపైనా చర్యలు తీసుకోనున్నారు. మొత్తానికి ఈనెల 28న దివ్య హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నారు పోలీసులు .