తెలంగాణలో పొలిటికల్ హీట్ 

తెలంగాణలో పొలిటికల్ హీట్ 

తెలంగాణలో రాజకీయ వేడీ రగులుకుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి... ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో తమ భవిష్యత్ కార్యాచరణను ఇప్పటినుంచే సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే రాజకీయంగా పలు ఆసక్తికర విషయాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ పై సొంతపార్టీలోనే అసంతృప్తి రగిలింది. ఏకంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంఎల్ సీలు తీర్మానించి సీఎంకు పంపటం సంచలనం రేపింది. డీఎస్ సీనియర్ నేత, అందులోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో ఆయనపై వేటుకు గులాబీ బాస్ ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంది. దానం నాగేందర్ కారెక్కటంతో బీసీలంతా  గంప గుత్తగా తమకే ఓట్లు వేస్తారనుకున్న గులాబీ పార్టీకి.... డీఎస్ తిరిగి సొంతగూటిలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారనే వార్త కొంత ఇబ్బందికర పరిస్థితే. 

ముందస్తు ఎన్నికలకు రంకెలు వేస్తున్న పార్టీలకు ఈ చేరికలు మరింత వేడి పుట్టిస్తున్నాయి. మంచి ఊపుమీద ఉన్న కాంగ్రెస్ ముందస్తుకే సై అంటోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత ఆయన డీఎస్ మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తే ... ఆ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంది. అటు బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయని హస్తం నేతలు చెబుతున్నారు. అటు.. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని భావిస్తున్న సీఎం ముందస్తు ఎన్నికలకు వెళ్తే మంచిదనే అభిప్రాయంలో ఉన్నారు. పార్టీ సీనియర్లతో సమావేశాలు జరుపుతున్నారు. పార్టీ నేతల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. ఇతర రాజకీయ పార్టీలు గందరగోళ స్థితిలో ఉన్నాయని, దాని నుంచి బయటపడడం వారికి సాధ్యం కాదని గులాబీ నేతల మనోగతం.