రాహుకాలంలో ఎన్నికల షెడ్యూల్.. నేతల్లో టెన్షన్‌..!

రాహుకాలంలో ఎన్నికల షెడ్యూల్.. నేతల్లో టెన్షన్‌..!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.. దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం.. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించిన సమయం ఇప్పుడు రాజకీయ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఆదివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా... సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల మధ్య రాహుకాలం కావడంతో అదే సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, షెడ్యూల్‌ను ప్రకటించడంతో నేతలకు భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాన తెలుగు రాష్ట్రాల్లో ఈ సెంటిమెంట్‌ నేతల్లో దడపుట్టిస్తుందట..! మరోవైపు పోలింగ్ సమయంలోనూ ప్రతీకూల గడియాలు ఉన్నాయంటున్నారు. తొలిదశ ఎన్నికల జరిగే ఏప్రిల్‌ 11న.. పోలింగ్‌ జరిగే సమయంలో సింహభాగం ప్రతికూల గడియలు ఉన్నట్లు జ్యోతిషులు చెబుతున్నారు. ఆ రోజు ఉదయం 6.07 గంటల నుంచి 7.39 గంటల వరకు యమగండం ఉందట.. పోలింగ్ ఉదయం 7 గంటలకు.. అంటే యమగండం సమయంలోనే ప్రారంభం కానుంది. ఇక ఆ తర్వాత ఉదయం 9.12 నుంచి 10.44 వరకు గుళికకాలం ఉంది. మరోవైపు మధ్యాహ్నం 1.49 నుంచి సాయంత్రం 3.22 గంటల వరకు రాహుకాలం. సాయంత్రం సుమారు రెండు గంటలపాటు వర్జ్యం ఉందట. పోలింగ్ రోజు అమృతగడియాలు కేవలం తెల్లవారుజామున 12.07 నుంచి 1.41 వరకే ఉన్నాయట.. దీంతో అసలే జ్యోతిష్యాన్ని అమితంగా నమ్మే మన నేతలకు భయం పట్టుకుందట. దేనికి విరుడు ఉన్నట్టుగానే ఈ గడియలన్నీ అమృతగడియలుగా మారే పూజలు ఏమైనా ఉండే ఉంటాయి.. వాటిపై మన నేతలు ఆరా తీస్తున్నారేమో మరి..!