మ‌ల్టిప్లెక్స్‌ల‌ కొంప ముంచనున్న పాప్ కార్న్ 

 మ‌ల్టిప్లెక్స్‌ల‌ కొంప ముంచనున్న పాప్ కార్న్ 

పాప్‌కార్న్‌..సినిమా ప్రేక్షకుల దృష్టిలో ఓ చౌకైన చిరుతిండే కావచ్చు. కానీ దేశంలోని సినీ పరిశ్రమను శాసిస్తున్న మల్టీప్లెక్స్ ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేస్తోంది. సినిమా హిట్టయినా ఫట్టయినా పెద్దగా తేడా రాని ఈ మల్టీప్లెక్సులకి ఇదో పెద్ద ఆదాయ వనరు అంటే నమ్మి తీరాలి. ఎందుకంటే మల్టీప్లెక్సులకి టిక్కెట్ల అమ్మకం తర్వాత అత్యధికంగా ఆదాయం ఆర్జించి పెట్టేది ఆహారపానీయాలే. ఇప్పుడు బయటి నుంచి ఆహారపానీయాలు తెచ్చుకోవచ్చనే మహారాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మల్టీప్లెక్స్ రంగాన్కి కోలుకోలేని విధంగా పెద్ద దెబ్బ కొట్టబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే మహారాష్ట్ర శాసనమండలిలో ప్రభుత్వం ప్రకటన చేయగానే ఈ షేర్లు 5-13 శాతం రేంజ్ లో పతనం అయ్యాయంటేనే ఈ నిర్ణయం ప్రభావం ఏ స్థాయిలో ఉండనుందో అర్థం చేసుకోవచ్చు.

కొన్ని నెలల క్రితమే బొంబాయి హైకోర్ట్ మల్టీప్లెక్సుల్లో అమ్మే ఆహారపానీయాలు నిర్ణీత ధరలకే అమ్మాలని ఆదేశించింది. దీనిపై త్వరలోనే ఒక విధానం నిర్ణయిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందుకే మహారాష్ట్ర ఆహార పౌరసరఫరాల మంత్రి రవీంద్ర చవాన్ ఆ విధంగా ప్రకటన చేశారు. ఆగస్ట్ 1 నుంచి ఉత్పత్తులపై పేర్కొన్న ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని.. అందుకు విరుద్ధంగా జరిపే అమ్మకాలను నిషేధిస్తున్నట్టు తెలిపారు. ప్రేక్షకులు బయటి నుంచి ఆహారపానీయాలు తెచ్చుకోవడాన్ని అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త ఆదాయమార్గాలు అన్వేషిస్తున్న మల్టీప్లెక్స్ ఇండస్ట్రీకి ఇది పెద్ద దెబ్బని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. 

కొన్నేళ్లుగా పుట్టగొడుగుల్లా మల్టీప్లెక్స్ లు పుట్టుకు రావడానికి ఆహారపానీయాల అమ్మకాలు ఆకర్షణీయంగా ఉండటమే కారణమని అంటున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి పీవీఆర్ సినిమాస్ 625, , ఐనాక్స్ లీజర్ 476 స్క్రీన్లు కలిగి ఉన్నాయి. 2011 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 150, 63 మాత్రమే. అంటే ఏడాదికి 60-80 0స్క్రీన్లు కొత్తగా ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. కొత్త మాల్స్ పుట్టుకొస్తుండటంతో 0ఈ ఆర్థిక సంవత్సరంలో 30-40% పెరుగుదల ఉండొచ్చని అంచనా. ఇదే ఒరవడి మరో రెండు, మూడేళ్లు కొనసాగేలా ఉంది. ఇలా ఇబ్బడిముబ్బడిగా కొత్త మల్టీప్లెక్సులు ఏర్పాటు చేయడంతో పాటు సరికొత్త ఆదాయ మార్గాలను వెతుకుతోంది మల్టీప్లెక్స్ రంగం. 

పిల్లల కోసం ప్లే హౌస్ పేరుతో థియేటర్లు, వర్చువల్ రియాలిటీ లాంజ్ లు, పీవీఆర్ ఐకాన్ అంటూ సబ్ బ్రాండ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. వీటన్నిటికీ ప్రధాన ఆదాయ వనరు ఆహారపానీయాలే. పెద్దసంఖ్యలో కస్టమర్లను ఆకర్షించేందుకు సెలబ్రిటీ షెఫ్ లను ఆహ్వానించడం, ఎప్పటికప్పుడు మెనూలో కొత్త ఐటమ్స్ చేర్చడం ద్వారా ఆకట్టుకుంటున్నాయి. 2017తో ముగిసిన ఆర్థిక సంవత్సరంతో కలిపి మల్టీప్లెక్సులు ఐదేళ్లుగా ఫుడ్ అండ్ బెవరేజెస్(ఎఫ్&బీ) పై ఆర్జించిన ఆదాయం చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. 2016లో 19 శాతం ఉన్న ఆహారపానీయాల ఆర్జన 2017లో 25-26 శాతానికి పెరిగింది. ఓ పక్క ఆహార పదార్థాల అమ్మకాలతో ఆదాయం పెరుగుతుంటే ప్రధానమైన టిక్కెట్ అమ్మకాలు పడిపోతున్నాయి. 2012 ఆర్థిక సంవత్సరంలో 62% ఉన్న టిక్కెట్ సేల్స్ 56%కి పడిపోయాయి. ఎఫ్&బీ అమ్మకాల ద్వారా మల్టీప్లెక్సులు 75% వరకు మార్జిన్ సంపాదిస్తున్నట్టు ఓ అంచనా. ఐదేళ్ల క్రితం ఎఫ్&బీ అమ్మకాల ద్వారా రూ.92.85 కోట్లు ఆర్జించిన పీవీఆర్ సినిమాస్ 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.580 కోట్లు సంపాదించింది. అంటే ఆరు రెట్ల కంటే ఎక్కువ మొత్తం కళ్లజూసింది.

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా మల్టీప్లెక్సుల్లో బయటి ఆహారం తెచ్చుకోవడాన్ని అనుమతించి, ఎఫ్&బీ ఐటమ్స్ ఎమ్మార్పీ ధరలకే అమ్మేలా చూస్తే అది పరిశ్రమకు పెద్ద దెబ్బే అవుతుంది. రాబోయే నెలల్లోనే మల్టీప్లెక్స్ ఇండస్ట్రీ మార్జిన్లు దారుణంగా క్షీణించే అవకాశం ఉంది. ఇదే కారణంగా ప్రభుత్వ ప్రకటన వెలువడగానే అగ్రశ్రేణి మల్టీప్లెక్స్ సంస్థల షేర్లు ఢమాల్ మన్నాయి. ఇన్నాళ్లూ పీవీఆర్, ఐనాక్స్ లీజర్ వంటి మల్టీప్లెక్సులు తమ హాళ్లలో తాము అమ్మే ఆహారపానీయాలే కొనుగోలు చేసేలా చేశాయి. పాప్ కార్న్ ను టికెట్ రేటు కంటే రెట్టింపు ధరకు అమ్మాయి. ఇప్పుడు అదే పాప్ కార్న్ ఈ కంపెనీల కొంప ముంచబోతోంది.