గోతులకు 3,597 మంది బలి

గోతులకు 3,597 మంది బలి

వాహనదారులను రోడ్డుపైనున్న గుంతలు కలవరపెడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో గుంతల్లో పడి మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశంలో 2017 సంవత్సరంలో ఏకంగా 3597 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే రోజుకు సగటున పది మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దేశంలో ఉగ్రవాదుల కంటే వీటి వల్లే ఎక్కువ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. 2017 దేశవ్యాప్తంగా ఉగ్ర దాడుల్లో 803 మంది ప్రాణాలు కోల్పోతే, కేవలం రోడ్డుపై గుంతల వల్ల ఏకంగా 3,597 మంది ప్రాణాలు కోల్పోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. 2016తో పోలిస్తే ఇది రెట్టింపుగా ఉంది. మహారాష్ట్రలో మరణాల సంఖ్య ఏకంగా రెండింతలు అయింది. 2017లో నక్సల్స్, ఉగ్ర దాడుల్లో దుండగులు, భద్రతా సిబ్బంది, ప్రజలు.. వీరితో కలిసి మొత్తం 803 మంది చనిపోయారు. 

రోడ్డు గుంతల్లో పడి మరణిస్తున్న వారి సంఖ్యలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 2017లో యూపీలో ఏకంగా 987 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 726 మంది, హరియాణాలో 522 మంది, గుజరాత్‌లో 228 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గత ఏడాది ఆయా రాష్ట్రాల్లో సంభవించిన మరణాల కంటే ఈసారి ఎక్కువగా ఉన్నాయి.  

ఈ మరణాలపై స్పందించిన నిపుణులు మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై హత్యానేరం కింద కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకలు, నిర్లక్ష్యం కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు.