యూవీ క్రియేషన్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్!

యూవీ క్రియేషన్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్!

స్టార్స్ నుండి ప్రతిఫలం ఆశించకుండా అభిమానించేది ఫ్యాన్సే! అందుకే 'వాళ్ళు లేకపోతే మేం లేం' అని నటీనటులు కూడా అంటుంటారు. అయితే... తమ అభిమాన కథానాయకుడి సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ నెలల తరబడి రాకపోతే... వాళ్ళే రివర్స్ లో దర్శక నిర్మాతలను శాపనార్థాలూ పెడతారు. ఇప్పుడు యు.వీ. క్రియేషన్స్ విషయంలో అదే జరుగుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోదరుడు ప్రమోద్, అతని మిత్రుడు వంశీ కలిసి యూవీ క్రియేషన్స్ స్థాపించారు. ఓ రకంగా ఇది ప్రభాస్ హోం బ్యానర్. కానీ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'రాథేశ్యామ్'కు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను నిర్మాతలు కానీ, దర్శకుడు రాధాకృష్ణ గానీ ఇవ్వడంలేదని అభిమానులు ఆగ్రహోదగ్దులైపోతున్నారు.

సోషల్ మీడియాలో 'నిద్రలే యూవీ క్రియేషన్స్' అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి తమ అసంతృప్తిని వెళ్ల గక్కుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేశం ఎంతవరకూ చేరిందంటే... ఈ హ్యాష్‌ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. 'రాథేశ్యామ్'కు సంబంధించి విడుదలచేసి పోస్టర్స్, మోషన్ పోస్టర్ తో సంతృప్తి చెందని అభిమానులు ట్రైలర్ త్వరగా ఇవ్వమని చిత్ర యూనిట్ ను కోరుతున్నారు. ఈ యేడాది జులై 30న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంతో వారి కోరిక సబబే అనిపిస్తోంది. కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఊపందుకోవడంతో పాన్ ఇండియా మూవీస్ అన్నీ కూడా వరుసగా వాయిదా పడుతున్నాయి. సో తమ సినిమా విడుదల  విషయమై యూవీ క్రియేషన్స్ కూడా పునరాలోచనలో పడొచ్చు. అందుకే ప్రచారాన్ని ఇంకా వేగవంతం చేసి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా... కనీసం ఉగాది రోజైనా 'రాధేశ్యామ్' ట్రైలర్ ను విడుదల చేస్తే... అభిమానుల ఆవేశం కొంతవరకూ చల్లారే ఆస్కారం ఉంటుంది.