కేసీఆర్ వెంట ప్రకాష్‌ రాజ్...

కేసీఆర్ వెంట ప్రకాష్‌ రాజ్...
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... ఇప్పటికే అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు... కోల్‌కతా వెళ్లి బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన కేసీఆర్... ఈ రోజు మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడతో సమావేశం కానున్నారు. ఈ ఉదయమే బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరిన వెళ్లిన కేసీఆర్... కాసేపటి క్రితమే బెంగళూరు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు నటుడు ప్రకాష్‌రాజ్, పార్లమెంట్ సభ్యులు వినోద్, సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలను ఏకం చేయాలని భావిస్తున్న కేసీఆర్ కార్యాచరణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 2.00 గంటలకు బెంగళూరులో దేవెగౌడతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా సీఎం కేసీఆర్‌ను కలిసిన నటుడు ప్రకాష్ రాజ్... ఇప్పుడు ఆయనతో కలిసి బెంగళూరు వెళ్లడం చర్చగా మారింది. ఇక బీజేపీ, ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షా వ్యతిరేకంగా ప్రకాష్‌రాజ్ గళంవిప్పుతున్న సంగతి తెలిసిందే.