ఈసీపై ప్రణబ్‌ ముఖర్జీ ప్రశంసలు..

ఈసీపై ప్రణబ్‌ ముఖర్జీ ప్రశంసలు..

ఓవైపు ఎన్నికల కమిషన్ పనితీరు, ఈవీఎంలపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.. ఎన్నికల సంఘాన్ని విమర్శించవద్దని హితవు పలికారు. కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రశంసల వర్షం కురిపించిన ప్రణబ్ ముఖర్జీ.. ఎన్నికలు అద్భుతంగా నిర్వహించారని కొనియాడారు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు ఎన్నికల నిర్వహణ సంస్థలన్న ఆయన.. సంస్థలన్నీ బాగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. సుదీర్ఘ కాలంగా పలు రాజ్యాంగ సంస్థలను నిర్మించుకున్నామని గుర్తు చేసిన ప్రణబ్.. చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో గొడవ పడతాడు.. మంచి కార్మికుడు పనిముట్లను సజావుగా ఉపయోగిస్తాడంటూ.. ఎన్నికల సంఘంపై విమర్శలు చేస్తున్న నాయకులకు చురకలంటించారు.

ఎన్నికల నిర్వహణ, ఈవీఎంల సామర్ధ్యంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారు.. తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి నేటి వరకు ఎన్నికల సంఘం సమర్ధవంతంగా, అత్యుత్తమంగా ఎన్నికలను నిర్వహిస్తోందని ప్రశంసించారు ప్రణబ్ ముఖర్జీ. సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 67 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ జనాభాలో రెండు వంతుల ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యారు.. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఓటు వేశాను... వీటన్నింటి వెనుక ఎన్నికల సంఘం కృషి ఉందన్నారు. ఇక ఎన్నికల కమిషనర్లు అందరినీ ప్రభుత్వాలే నియమిస్తూ వచ్చాయని.. ఎన్నికల కమిషనర్లపై ఆరోపణలు చేస్తున్నవారిపై సెటైర్లు వేశారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.