కాంగ్రెస్‌కు పీకే కృతజ్ఞతలు.. రాహుల్, ప్రియాంకకు స్పెషల్ థ్యాంక్స్..

కాంగ్రెస్‌కు పీకే కృతజ్ఞతలు.. రాహుల్, ప్రియాంకకు స్పెషల్ థ్యాంక్స్..

అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్... ప్రధాని మోడీని గద్దెనెక్కించినా... ఆ తర్వాత బీహార్‌లో నితీష్ కుమార్‌ను సీఎం చైర్‌లో కూర్చోబెట్టినా... అంతెందుకు ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి ఎంతో కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఉన్నట్టుండి కాంగ్రెస్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే జేడీయూలో చేరి ఉపాధ్యక్షుడి బాధ్యతలు నిర్వహిస్తోన్న ప్రశాంత్ కిషోర్... సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా గళమెత్తిన కాంగ్రెస్‌కు పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రశాంత్ కిషోర్... ఈ చట్టాన్ని అమలు చేసేది లేదంటూ బీహార్ ప్రజలకు హామీ ఇచ్చారు. సీఏఏను వ్యతిరేకిస్తూ జరుగుతోన్న కార్యక్రమాల్లో పాల్గొంటున్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 

సీఏఏ, ఎన్‌ఆర్సీని నిస్సందేహంగా తిరస్కరించినందుకు కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ట్వీట్ చేసిన ప్రశాంత్ కిషోర్.. సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటంలో తీవ్ర కృషి చేస్తోన్న రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టో పేర్కొన్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడితే... ఆ పార్టీలో చీలికకు దారితీసింది. ప్రశాంత్ కిషోర్ మరియు పవన్ వర్మ మధ్య పార్టీలో చీలికలు వచ్చాయి. అయితే, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకించిన ఎన్‌డీఏకు చెందిన తొలి సీఎం నితీష్ కుమారే.. ఇక, ఇవాళ ఎన్‌ఆర్సీపై ప్రశాంత్ కిషోర్ వాయిస్ మారింది... ఎన్ఆర్సీపై అందరికీ భరోసా ఇవ్వాలనుకుంటున్నాను... బీహార్‌లో దీనిని అమలు చేసేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు కనీసం 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు... ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, పుదుచ్చేరి, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు తాము ఎన్‌ఆర్‌సీ అమలు చేయబోమని ప్రకటించిన సంగతి తెలిసిందే.