కాకరేపుతున్న పీకే ట్వీట్..!

కాకరేపుతున్న పీకే ట్వీట్..!

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో పశ్చిమబెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఎన్నికలను ఉద్దేశించి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికలను భారతదేశంలో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న కీలక యుద్ధంగా ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. అంతేకాదు బెంగాల్ కేవలం తన కూతురిని కోరుకుంటోందంటూ, మమతా బెనర్జీని మాత్రమే బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నారని ట్వీట్ చేశారు. గతంలోనూ బీజేపీ నేతలకు పీకే సవాల్ విసిరారు. డిసెంబర్ 21న చేసిన ట్వీట్‌ లో పశ్చిమ బెంగాల్ లో బీజేపీ డబుల్ డిజిట్ కోసం తెగ కష్టపడుతుందని, ఒకవేళ బీజేపీ డబుల్ డిజిట్ ను దాటి ఎక్కువ స్థానాలు సంపాదిస్తే తాను ట్విటర్ ను వదిలేస్తానని, బీజేపీ 200 సీట్లు గెలుచుకోవడంలో విఫలమైతే ఆ పార్టీ నేతలు తమ పదవులకు స్వస్తి పలుకుతారా అని ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. 

మరోపక్క పశ్చిమ బెంగాల్  ఎన్నికలను ఎనిమిది విడతల్లో నిర్వహించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక మోడీ ఉన్నాడా, అమిత్ షా ఉన్నాడా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 294 నియోజకవర్గాల్లో ఉన్న పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని, ఈసారి ఎలాగైనా పశ్చిమబెంగాల్ లో పాగా వేయాలని బిజెపి ప్రయత్నం చేస్తోంది. బీజేపీ వ్యూహాలను చిత్తు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. బెంగాల్ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ తృణమూల్‌ తరపున పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇక, సవాళ్లు -ప్రతి సవాళ్లు, నేతల ఫిరాయింపులు, అల్లర్లు-హింసాకాండలతో అసెంబ్లీ ఎన్నికల ముందు బెంగాల్‌ యుద్ధ వాతావరణం ఏర్పడింది. పదేళ్లు అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌పై వ్యతిరేకత తమ పార్టీకి అధికారం కట్టబెడతాయని బీజేపీ నేతలు నమ్మకంతో ఉన్నారు. బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో బెంగాల్‌లో అధికారంలోకి రానివ్వకూడదని సీఎం మమతా బెనర్జీ ప్రణాళికలు రచిస్తున్నారు. మరోపక్క బిజెపి సీఎం అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. తమ అభ్యర్థిని పార్టీ పార్లమెంటరీ బోర్డ్‌ నిర్ణయిస్తుందంటున్నారు బిజెపి నేతలు. అయితే, సీఎం అభ్యర్థిత్వానికి బరిలో ఉన్నారంటూ పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. బెంగాల్‌ బిజెపి అధ్యక్షుడు దిలీప్‌ ఘోస్‌ పేరు బలంగా వినిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం నుండి వచ్చిన దిలీప్‌ ఘోష్‌ రాష్ట్రంలో బిజెపి వ్యూహాలను అమలు చేయటంలో కీలకంగా ఉన్నారు.