మా అబ్బాయి అలాంటోడు కాదు !

మా అబ్బాయి అలాంటోడు కాదు !

అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించారనే ఆరోపణలతో ఇద్దరు భారతీయులను పాకిస్థాన్‌ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో తెలుగు వ్యక్తి ప్రశాంత్‌ కూడా ఉన్నాడు. ప్రశాంత్‌ను అరెస్టు చేయడంపై ఆయన తండ్రి బాబూరావు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రేమ వ్యవహారంలో తమతో విభేదించి ఏడాదిన్నర క్రితమే తమ కుమారుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని బాబూరావు చెప్పారు. ప్రశాంత్ పాకిస్థాన్ సరిహద్దులకు ఎందుకు వెళ్లాడో తెలీయదన్నారు. తన కొడుకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి కాదని అన్నారు. డిల్లీ వెళ్లి రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తమ కుమారుడ్ని క్షేమంగా అప్పగించాలని కోరతామన్నారు.

విశాఖపట్నానికి చెందిన బాబూరావు కుటుంబం గత ఐదేళ్లుగా కూకట్‌పల్లిలో నివాసం ఉంటోంది. ప్రాశాంత్‌ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బెంగళూరులో ఓ కంపెనీలో పని చేస్తున్న సమయంలో సహోద్యోగితో ప్రేమలో పడ్డాడు. అది విఫలం కావడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌ వెళ్లి పొరపాటున పాక్‌లోకి అడుగుపెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. ప్రశాంత్ ను పాకిస్థాన్ అరెస్టు చేయడంపై ఆయన స్వస్థలం విశాఖలో బంధువులు, చుట్టుపక్కల వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రశాంత్ పేరుకు తగ్గట్టు శాంతంగా ఉంటాడని వారు చెబుతున్నారు. స్థానికంగా ప్రశాంత్ కుటుంబానికి చాలా మంచి పేరు ఉందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ప్రశాంత్‌ను వీలయినంత తొందరగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నారు.