థర్డ్ పార్టీ బీమా మరింత ప్రియం..

థర్డ్ పార్టీ బీమా మరింత ప్రియం..

మోటారు వాహనాల థర్డ్ పార్టీ బీమా మరోసారి పెరగనుంది... థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం ఈ ఏడాదిలో సుమారుగా 12 శాతం పెరగనుంది. జూన్ 16వ తేదీ నుంచి థర్డ్‌ పార్టీ బీమా కొత్త ప్రీమియం అమల్లోకి వస్తుందని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్‌డీఏఐ) తెలిపింది. గత ఏడాది సెప్టెంబరు 1వ తేదీ తర్వాత కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాలకు ఐదేళ్లకు, ఫోర్‌వీలర్లకు మూడేళ్ల ప్రీమియాన్ని యజమానులు ముందే చెల్లించేలా బీమా నియంత్రణ సంస్థ నిబంధనలు తీసుకురాగా.. అంతకంటే ముందే కొన్న వాహనాలకు వార్షిక ప్రీమియం పద్ధతి అమలవుతోంది. దీనినే ఇప్పుడు బీమా నియంత్రణ సంస్థ పెంచేసింది. అయితే, గత సెప్టెంబరు తర్వాత కొన్న వాహనాలకు చెల్లించే ప్రీమియంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇక, గత ఏడాది వరకు బస్సులన్నింటికీ ఒకే విధమైన ప్రీమియం ఉండగా.. ఇప్పుడు స్కూలు బస్సులకు 5 శాతం, ఇతర బస్సులకు ప్రీమియం 10 శాతం చొప్పున ప్రీమియం పెంచారు. వెయ్యి సీసీ సామర్థ్యం లోపుగల ప్రైవేటు కార్లకు ప్రీమియం రూ.2,072గా, వెయ్యి నుంచి 1,500 సీసీలోపు గల కార్లకు రూ.3,221గా ఖరారు చేశారు. పెరిగిన బీమా ప్రీమియం ధరలు ఈ నెల 16వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.