కేదార్‌నాథ్ గుహలో మోడీ ధ్యానం..

కేదార్‌నాథ్ గుహలో మోడీ ధ్యానం..

ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం సందర్శించుకున్నారు. కేదారీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. రెండు రోజుల ఉత్తరాఖండ్‌ పర్యటనలో ఆదివారం బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈరోజు కేదార్ నాథ్ లోనే గడపనున్న మోడీ సుమారు 20 గంటలపాటు ధ్యాన గుహలోనే ఉండనున్నారు. 

కేదార్‌నాథ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ఈ రోజు డిఫరెంట్ గెటప్ లో దర్శనమిచ్చారు. ఒకింత నేపాలీ లుక్ త‌ర‌హాలో ఉన్నా.. నీలి రంగు చోలా(ఫ్రాక్‌) డ్రెస్సులో మోదీ కేదార్‌నాథ్‌ను ద‌ర్శించుకున్నారు. హిమాచ‌ల్ ప్రజ‌లు ధ‌రించే టోపీతో.. మెడ‌లో భారీ శాలువ‌ను వేసుకున్నారు. న‌డుముకు ఎర్రటి కండువాను కూడా కట్టారు. ఉద‌యం హెలికాప్టర్ దిగిన తర్వాత మోడీ నేరుగా ఆల‌యం ద‌గ్గర‌కు వెళ్లారు. అక్కడ గుడి చుట్టూ ప్రద‌క్షిణ చేసిన త‌ర్వాత కేదారీశ్వరుడి గ‌ర్భగుడిలోకి వెళ్లారు. మోడీ రాక సంద‌ర్భంగా ఆల‌యం చుట్టు రెడ్ కార్పెట్ ప‌రిచారు. ఆ కార్పెట్‌పైనే మోడీ ప్రద‌క్షిణ చేశారు. 

కేదార్‌నాథ్‌ ఆలయాన్ని మోడీ గతంలోనూ పలుమార్లు దర్శించుకున్నారు. గతేడాది నవంబరు నెలలో దీపావళి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు 2017లో రెండు సార్లు కేదార్‌నాథ్‌కు వచ్చారు. చివరి విడత పోలింగ్‌కు ఒక్కరోజు ముందు మోదీ కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకోవడం ఆసక్తిగా మారింది. ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలోనూ ఆదివారం ఎన్నిక జరగనుంది.