మోడీ ప్రభుత్వానికి సౌదీ గిఫ్ట్?

మోడీ ప్రభుత్వానికి సౌదీ గిఫ్ట్?

ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వానికి సౌదీ అరేబియా నుంచి భారీ బహుమానం అందే సూచనలు కనిపిస్తున్నాయి. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నట్టు తెలుస్తోంది. వెనిజులా సంక్షోభం, కీలక రంగాల్లో పెట్టుబడులు వంటి అంశాలతో కుస్తీ పడుతున్న భారత ప్రభుత్వానికి యువరాజు చమురు ధరలు నిలకడగా ఉంచుతామని హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 

భారత-సౌదీల రాజకీయ, ఆర్థిక సంబంధాలు బాగున్నప్పటికీ భారత్ లో సౌదీ అరేబియా పెట్టుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అత్యంత ధనిక గల్ఫ్ దేశం, భారత్ కు అతిపెద్ద చమురు సరఫరాదారు అయిన సౌదీ ఇప్పుడు భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్టు ఈటీ తెలిపింది. యువరాజు సల్మాన్ పర్యటన వాస్తవరూపం దాలిస్తే ఇండో-సౌదీల ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరో మెట్టుకి చేరుతుందని ఈ పరిణామాల విశ్లేషిస్తున్న నిపుణులు చెబుతున్నారు. 

గత నవంబర్ లో బ్యూనస్ ఎయిర్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యువరాజు సల్మాన్  భేటీ అయ్యారు. రాబోయే 2-3 ఏళ్లలో విద్యుత్, రక్షణ, ఆహార భద్రత, ఉత్పత్తి రంగాల్లో సౌదీ పెట్టుబడులను పెంచే కార్యాచరణను రెండు దేశాలు ఈ సమావేశంలో నిర్ణయించాయి. జాతీయ మౌలిక వసతుల నిధికి ఎంత మొత్తం ఆరంభ పెట్టుబడిగా పెట్టాలో నిర్ణయిస్తామని యువరాజు ప్రధానికి చెప్పినట్టు తెలిసింది. టెక్నాలజీ, వ్యవసాయం, ఇంధన రంగాల్లో పెట్టుబడి అవకాశాల గురించి కూడా సల్మాన్ ప్రస్తావించారు.