రండి బాబు రండీ... మా కాలేజీలో చేరండి

రండి బాబు రండీ... మా కాలేజీలో చేరండి

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లు భర్తీకి యాజమాన్యాలు నానా అవస్థలు పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా వేల సీట్లు మిగిలిపోనున్న నేపథ్యంలో విద్యార్థులను ఆకర్శించేందుకు కాలేజీలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొన్ని కాలేజీలు ఫీజు తక్కువ అని ప్రకటిస్తే... మరికొన్ని మాత్రం బహుమతులు ఇస్తున్నాయి. మరికొందరైతే ఏకంగా ద్విచక్ర వాహనాలనే కొనిస్తామంటున్నాయి. ఏఐసీటీఈ నివేదిక ప్రకారం 2016-17 విద్యా సంవత్సరంలో  దేశవ్యాప్తంగా ఉన్న 3,291 ఇంజినీరింగ్ కాలేజీల్లోని 15.5 లక్షల సీట్లలో సగానికి పైగా ఖాళీగానే మిగిలిపోయాయి. 2015-16లో కూడా ఇదే పరిస్థితి. తాజాగా సీట్ల భర్తీకోసం కాలేజీలు కొత్త కొత్త మార్కెటింగ్ సూత్రాలను పాటిస్తున్నాయి. 

ఈ ఏడాది మొదటి రౌండ్ పూర్తి అయ్యే సరికి గుజరాత్ లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 55,422 సీట్లలో కేవలం 34,642 మాత్రమే భర్తీ అయ్యాయి. ఏపీలో కూడా కొన్ని కాలేజీలు పోటీ పడి విద్యార్థులకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సరైన వసతులులేని కళాశాలల పరిస్థితి మరీ దారుణం. అలాంటి కాలేజీల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఫీజు ఏడాదికి కేవలం రూ.2,500 మాత్రమే అని కొన్ని కాలేజీలు ప్రకటించాయి. మరికొన్ని కాలేజీలు ఉచితంగా లాప్ టాప్ ఇస్తామంటున్నాయి. మరికొందరైతే ... ద్విచక్ర వాహనాన్ని ఆఫర్ చేస్తున్నారు. ఫ్రీ ట్రాన్స్ పోర్టు, ఉచిత హాస్టల్ సదుపాయం, నాలుగేళ్ల ఫీజు ఒకేసారి చెల్లిస్తే ఉచితంగా ద్విచక్ర వాహనం లాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇక కాలేజీ ఏజెంట్లుకు పండగే పండుగ ఒక అడ్మిషన్ పై సుమారు రూ.10,000 ఇవ్వటానికి కూడా వెనుకాడటం లేదు. ఇంజినీరింగ్ విద్యపై ఇటీవల ఆసక్తి తగ్గింది అనటానికి ఇవే నిదర్శనం. దీంతో పాటు  ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారిలో 95శాతం మంది ఉద్యోగానికి పనికి రావటం లేదని ఇటీవల పలు నివేదికలు చెప్పటం కూడా ప్రభావం చూపుతోంది.