యనమలపై ప్రివిలేజ్ పెట్టాలి

యనమలపై ప్రివిలేజ్ పెట్టాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేసిన వ్యక్తి మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడేనని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఫైరయ్యారు. మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ యనమల ఆర్థిక క్రమశిక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఉమ్మారెడ్డి విమర్శించారు. రూ.97 వేల కోట్లతో ప్రారంభమైన అప్పుని రూ.3 లక్షల కోట్లకు పెంచడమేనా నీ అనుభవం అంటూ యనమలపై నిప్పులు చెరిగారు. 

యనమల తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. 600 హామీలు ఇచ్చి ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదని, ఎన్ని హామీలు అమలు చేశారో యనమల చెప్పాలని నిలదీశారు. రైతులకు రూ.24 వేల కోట్లు ఇచ్చేశామని చెబుతున్న యనమల, ఇంకా మూడు, నాలుగు విడతలు ఇవ్వలేదని గుర్తుంచుకోవాలని చెప్పారు. మేనిఫెస్టో అంటే ఐదేళ్ల కాలంలో అమలు చేస్తామని ప్రజలకిచ్చిన హామీ అని ఆయన గుర్తు చేశారు. తామిచ్చిన హామీలను కొత్త ప్రభుత్వంపై రుద్దడం సరికాదని.. మిగిలిన హామీలు కొత్త ప్రభుత్వం అమలు చేయాలని యనమల డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఉమ్మారెడ్డి. సుదీర్ఘ అనుభవం ఉన్న యనమల విజ్ఞతకి ప్రజలు విస్తూ పోతున్నారని ఎద్దేవా చేశారు. సభలోనూ ప్రజలకు అనేక హామీలిచ్చి మోసం చేసినందుకు యనమలపై ప్రివిలేజ్ పెట్టాలని అన్నారు.