శివసేనలో చేరిన ప్రియాంక చతుర్వేది

శివసేనలో చేరిన ప్రియాంక చతుర్వేది

కాంగ్రెస్ పార్టీకి రాజీనామాతో ఝలక్ ఇచ్చిన ప్రియాంక చతుర్వేది శివసేనలో చేరారు. కాంగ్రెస్ లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆరోపణలు చేసి ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొంతమంది నేతలు తమ అనుచిత ప్రవర‍్తనతో బాధించారంటూ ఆమె కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి  ఒక లేఖ రాశారు. రాహుల్‌ నుంచి ఎలాంటి సమాధానం కోసం వేచి చూడకుండానే.. వెంటనే శివసైనలో చేరిపోయారు. ముంబయిలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో ఆమె శుక్రవారం ఉదయమ సమావేశమయ్యారు. అనంతరం ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

కాగా కొద్ది కాలం క్రితం మధురలో మీడియా సమావేశంలో కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలు  తనపై అభ్యంతరకరంగా వ్యవహరించారంటూ  ప్రియాంక చతుర్వేది పార్టీ నాయకత్వానికి పిర్యాదు చేశారు. అనంతరం పార్టీ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. కానీ తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా వారిపై సస్పెన్సన్ ఎత్తివేసినట్లు ప్రకటించడం వివాదానికి దారి తీసింది. దీనిపై ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ ట్వీట్‌ చేశారు. అభ్యంతరకరంగా మాట్లాడి, తనను బెదిరించిన వాళ్లకు కనీస శిక్ష పడకపోవడం చాలా బాధిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.