వారణాసి నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశం: రాబర్ట్ వాద్రా

వారణాసి నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశం: రాబర్ట్ వాద్రా

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, తూర్పు యుపి ఇన్ ఛార్జి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రియాంక వాద్రా వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఢీ కొనబోతున్నారని అంచనా వేస్తున్నారు. ప్రియాంక గాంధీ వారణాసి నుంచి మోడీపై పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు ఆమె భర్త రాబర్ట్ వాద్రా సూచనప్రాయంగా తెలిపారు. ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వాద్రా చెప్పారు. అయితే దీనిపై తుది నిర్ణయం పార్టీ తీసుకుంటుందన్నారు. తాము శాయశక్తులా కష్టపడి పనిచేస్తామని వాద్రా తెలిపారు.

ఎన్నికల ఏడో దశలో మే 19న వారణాసిలో పోలింగ్ జరుగుతుంది. ప్రధాని మోడీ ఏప్రిల్ 26న నామినేషన్ వేస్తారని అంటున్నారు. ప్రియాంక వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన సన్నద్ధత వ్యక్తం చేశారు. కానీ దీనిపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తీసుకోవాల్సి ఉంది. 

ప్రియాంక గాంధీ వాద్రా తనను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, తూర్పు యుపి ఇన్ ఛార్జిగా నియమించింది మొదలు ప్రత్యక్ష రాజకీయాల్లో పూర్తిస్థాయిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. క్రమం తప్పకుండా ఉత్తరప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఒక కార్యకర్త ఎన్నికల్లో పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తే మోడీపై పోటీ చేస్తానని ప్రియాంక జవాబు ఇచ్చారు.