కాంగ్రెస్ ఏం చేయలేదనే మాటకు కాలం చెల్లింది

కాంగ్రెస్ ఏం చేయలేదనే మాటకు కాలం చెల్లింది

తమకు ముందు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు 70 ఏళ్లలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్న బీజేపీ మాటకు కాలం చెల్లిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ఘాటుగా వ్యాఖ్యనించారు. వాళ్లు ఈ ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని ప్రియాంక వాద్రా నిలదీశారు. 'వాళ్లు (బీజేపీ) వాస్తవ పరిస్థితులను తెలుసుకొనేందుకు క్షేత్రస్థాయికి రావాలి' అని ఉత్తరప్రదేశ్ లోని భదోహీ జిల్లాలో సవాల్ చేశారు. 'ఈ రిపోర్ట్ కార్డ్ (రాష్ట్ర ప్రభుత్వానిది), ప్రచారం అంతా బాగున్నాయి. కానీ వాస్తవాలు వేరు. అన్ని వర్గాలవారు వేధింపులకు గురవుతున్నారని' ప్రియాంక చెప్పారు.

తమ ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ రాజధాని లక్నోలో విడుదల చేసిన రిపోర్ట్ కార్డ్ పై ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. 'ఎన్నికల్లో వాగ్దానాలు చేయడానికి వాటిని నెరవేర్చడానికి మధ్య చాలా తేడా ఉంది. 70 ఏళ్ల గురించి అరుపులకు (ఎలాంటి అభివృద్ధి లేదని) కూడా ముగింపు తేదీ ఉంటుంది. గత ఐదేళ్లుగా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఈ ఐదేళ్లలో మీరేం చేశారు?' అని ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నించారు. 

యోగి పరిపాలనలో క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు జరగలేదని ప్రియాంక ఆరోపించారు. 'ప్రతిరోజూ, నేను సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నాను. విద్యార్థులు, యువత, ఆంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు అంతా వేధింపులకు లోనవుతున్నారు. కొన్ని చోట్ల వారికి రూ.17,000 జీతంగా ఇస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు వారికి ఏమీ రాలేదు. రెండేళ్లుగా వాళ్లకి రూ.8,000 మాత్రమే ఇస్తున్నారు.' అని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.

ప్రియాంక వాద్రా గంగా నదిలో మూడు రోజుల పడవ ప్రయాణం చేపట్టారు. అందులో భాగంగా ఇవాళ మీర్జాపూర్ కి వెళ్లే ముందు సీతామర్హి ఆలయంలో ఆమె ప్రార్థనలు చేశారు. ఆమె ప్రచారం వారణాసిలో ముగుస్తుంది.