దేశవ్యాప్తంగా 100 ర్యాలీలు నిర్వహించనున్న ప్రియాంక గాంధీ

దేశవ్యాప్తంగా 100 ర్యాలీలు నిర్వహించనున్న ప్రియాంక గాంధీ

లోక్ సభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా పార్టీల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ కూడా ఊపులోకి వచ్చేసింది. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా అనేక నేతలు దేశవ్యాప్తంగా ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ తన మరో స్టార్ క్యాంపెయినర్ ను రంగంలోకి దించుతోంది. తమ జనరల్ సెక్రటరీ, తూర్పు యూపీ ఇన్ చార్జి ప్రియాంక గాంధీని దేశవ్యాప్తంగా ప్రచారానికి రప్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రియాంక గాంధీ ఇక ఉత్తరప్రదేశ్ బయట కూడా ప్రచారం ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 100 ఎన్నికల ర్యాలీలలో ఆమె ప్రసంగించే అవకాశం ఉంది. ఇందులో ఉత్తరప్రదేశ్ కూడా ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంగ్లీష్ వార్తాపత్రిక ఎకనామిక్ టైమ్స్ వార్తా కథనం ప్రకారం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రియాంక వాద్రా ర్యాలీల్లో పాల్గొనాల్సిన లోక్ సభ స్థానాల జాబితాను తయారు చేస్తోంది. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ఈ లిస్ట్ తయారు చేస్తున్నట్టు ఒక కాంగ్రెస్ నేత చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులకు తప్పనిసరిగా అధిష్ఠానం సహాయం కావాల్సిన స్థానాలతో మాత్రమే ఈ జాబితా సిద్ధం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ప్రియాంక గాంధీతో మొత్తం 100 ర్యాలీలు నిర్వహించాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. 

ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ లో మాత్రమే పార్టీ ప్రచారం నిర్వహించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆమె తూర్పు యుపిలోని అనేక జిల్లాల్లో పర్యటించారు. వీటిలో ఆమె పడవ ద్వారా యాత్ర చేసి ప్రజలను కలుసుకున్నారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అంతే కాకుండా అనేక చోట్ల రోడ్ షోలు చేశారు. ఆమె ఏప్రిల్ 4న తన సోదరుడు రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు సమర్పించేటపుడు కేరళలోని వాయనాడ్ కి కూడా వెళ్లారు. అక్కడ రోడ్ షోలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ నేతలు చెబుతున్న వివరాలను బట్టి ప్రియాంక యుపి కాకుండా కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలలో ర్యాలీ నిర్వహించే అవకాశం ఉంది. సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి కొన్ని ర్యాలీల్లో పాల్గొనవచ్చు. ఓటర్లను ఆకర్షించేందుకు పీసీసీ అధ్యక్షులు తమ రాష్ట్రంలో ర్యాలీలు జరపాలని కోరుతున్నారు. ప్రియాంక వాద్రాకు లభిస్తున్న ప్రజా స్పందనను చూసి దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, నేతలు తమ ప్రాంతంలో ఆమె ర్యాలీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారని ఒక కాంగ్రెస్ నేత చెప్పారు. ప్రతి స్థానంలో ర్యాలీ చేయడం కష్టం కనుక, పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చే స్థానాలను ఎంపిక చేసి అక్కడ ప్రియాంక ర్యాలీలు ఏర్పాటు చేయనున్నారు.