నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌

నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌

అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది... ఈ సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌కు తెరలేవనుంది... 13 వారాల పాటు అభిమానులను ఉర్రూతలూగించడానికి... కబడ్డీ కబడ్డీ అంటూ దూసుకెళ్లడానికి వచ్చేస్తున్నారు ఆటగాళ్లు... ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-6 టోర్నీ ఇవాళ ప్రారంభం కానుంది... తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పట్నా పైరేట్స్‌... తమిళ్‌ తలైవాస్‌తో తలపడనున్నాయి. ఇక మూడు నెలల పాటు సుదీర్ఘంగా సాగే ఈ టోర్నీలో 12 జట్లను రెండు జోన్లుగా విభజించారు. ప్రతి జట్టు 15 ఇంట్రా జోనల్‌, ఏడు ఇంటర్‌ జోనల్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతి జోన్‌లో టాప్‌-3లో నిలిచిన జట్లు సూపర్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్‌ ప్లేఆఫ్‌లో క్వాలిఫయర్స్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు ఉంటాయి. జోన్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లకు ఫైనల్‌కు అర్హత సాధించేందుకు అదనంగా ఒక అవకాశం లభిస్తుంది. ప్లేఆఫ్స్‌కు కోచి అతిథ్యమివ్వనుండగా... జనవరి 5న ముంబై వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

ప్రొకబడ్జీ సీజన్‌ -6లో తెలుగు టైటాన్స్‌, బంగాల్‌ వారియర్స్‌, బెంగళూరు బుల్స్‌, దబాంగ్‌ దిల్లీ, గుజరాత్‌ ఫార్చ్యున్‌జెయింట్స్‌, హరియాణా స్టీలర్స్‌, జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, పట్నా పైరేట్స్‌, పుణెరి పల్టాన్‌, తమిల్‌ తలైవాస్‌, యూపీ యోధ, యు ముంబా జట్లు తలపడనున్నాయి. ఈ లీగ్‌ సీజన్‌-6లో జరిగే మొత్తం 138 మ్యాచ్‌లో జరగనుండగా... ఇందులో 11 మ్యాచ్‌లకు హైదరాబాద్‌ లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతాయి. మరోవైపు సీజన్‌-6లో చాలా జట్లు కెప్టెన్లను మార్చాయి. తెలుగు టైటాన్స్‌కు రాహుల్‌ చౌదరి స్థానంలో విశాల్‌ భరద్వాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యూపీ యోధకు రిషాంక్‌ దేవడిగ, పుణెరి పల్టాన్‌కు గిరీష్‌ ఎర్నాక్‌, దిల్లీ దబాంగ్‌కు జోగీందర్‌ నర్వాల్‌, గుజరాత్‌ ఫార్చ్యున్‌ జెయింట్స్‌కు సునీల్‌ కుమార్‌ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నారు.