ప్రొ కబడ్డీ.. డిఫెండింగ్‌ చాంపియన్‌కు షాక్

ప్రొ కబడ్డీ.. డిఫెండింగ్‌ చాంపియన్‌కు షాక్

ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న ప్రొ కబడ్డీ లీగ్‌.. ఆరవ సీజన్‌ ఆదివారం ఘనంగా ప్రారంభం అయింది. మొదటి రోజే సంచలనం నమోదయింది. సీజన్ తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌కు ఊహించని షాక్ తగిలింది. భారత కెప్టెన్ అజయ్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని తమిళ్‌ తలైవాస్‌ జట్టు 42–26తో ప్రదీప్‌ నర్వాల్‌ సారథ్యం వహిస్తున్న పట్నా పైరేట్స్‌ను చిత్తుగా ఓడించింది. అజయ్‌ ఠాకూర్‌ 14 పాయింట్లతో సత్తాచాటి తమిళ్‌ తలైవాస్‌కు చక్కటి విజయాన్ని అందించాడు. ఇక ట్యాక్లింగ్‌లో అమిత్‌ హుడా చెలరేగడంతో పట్నా రైడర్స్ పాయింట్స్ చేయడంలో విఫలమయ్యారు. మరోవైపు పట్నా కెప్టెన్‌ ప్రదీప్‌ నర్వాల్‌ 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.

పుణేరీ పల్టన్, యు ముంబాల మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 'డ్రా'గా ముగిసింది. రెండు జట్లు చివరి నిమిషం వరకు పోరాడడంతో 32–32 స్కోర్ తో మ్యాచ్ డ్రా అయింది. పుణేరీ పల్టన్స్‌ ఆటగాడు నితిన్‌ తోమర్‌ 15 రైడ్‌ పాయింట్లు సాధించాడు. యు ముంబా ఆటగాడు సిద్ధార్థ్‌ దేశాయ్‌ 14 పాయింట్లతో రాణించాడు. సోమవారం హరియాణా స్టీలర్స్‌-పుణేరీ పల్టన్, యూపీ యోధా-తమిళ్‌ తలైవాస్‌ జట్లు తలపడనున్నాయి.