2022పై కర్ఛీప్ వేస్తున్న హీరోలు

2022పై కర్ఛీప్ వేస్తున్న హీరోలు

టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాల హవా బలంగా వీస్తోంది. దాంతో రిలీజ్ డేట్స్ ను మందస్తుగా ప్రకటించే విషయంలో బాలీవుడ్ పంథాను మన దర్శక నిర్మాతలు ఫాలో అవుతున్నారు. వచ్చే యేడాది విడుదలయ్యే సినిమాల రిలీజ్ డేట్స్ సైతం ఇప్పుడే ప్రకటించేస్తుండటం విశేషం. అందులో దాదాపుగా అన్నీ పాన్ ఇండియా చిత్రాలే! ఈ ఏడాది ఇంకా మనం మూడో నెలలోనే ఉన్నాం. కానీ మన దర్శక నిర్మాతల ముందు చూపు మాత్రం వచ్చే యేడాదికి చేరిపోయింది.

ఇందులో అందరికంటే మహేశే ముందున్నాడని చెప్పాలి. 'సర్కారు వారి పాట'ను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తానని ఆయన ముందే చెప్పేశారు. అలానే అదే సీజన్ లో పవన్ కళ్యాణ్ - క్రిష్ మూవీని విడుదల చేయబోతున్నట్టు నిర్మాత ఎ.ఎం. రత్నం ప్రకటించారు. ఇదిలా ఉంటే... ఆరేళ్ళ క్రితం అదే సీజన్ లో 'సొగ్గాడే చిన్ని నాయన'గా వచ్చిన నాగార్జున... వచ్చే యేడాది సంక్రాంతికి 'బంగర్రాజు'గా వస్తానంటున్నారు. 

సంక్రాంతి సినిమాల సందడి ఇలా ఉంటే... 'పుష్ప'లో నటిస్తున్న అల్లు అర్జున్... నెక్స్ట్ కొరటాల శివ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా వచ్చే యేడాది మార్చి 31న వస్తుందని సమాచారం. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ పొలిటీషియన్ గా నటించబోతోందట. ఇక షూటింగ్ మొదలైన ప్రభాస్ 'సలార్' వచ్చే యేడాది ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేయబోతున్నాడు.'అయిననూ పోయి రావలె హస్తినకు' వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాను 2022 ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తారని అంటున్నారు.

ప్రస్తుతం చిరు 'ఆచార్య'  చేస్తున్నారు. ఆ తర్వాత 'లూసిఫర్' రీమేక్ సెట్స్ పైకి వెళుతుంది. ఇటీవలే ఈ సినిమా పూజ జరుపుకుంది. ఈ మూవీ నెక్ట్స్ ఇయర్ జనం ముందుకు రానుంది. అలానే మరో ముగ్గురు యువ దర్శకులతో ప్రాజెక్ట్ చేయడానికి సైతం చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో మరో సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల అవటం ఖాయం. విజయ్ దేవరకొండ - సుకుమార్ తో కేదార్ సెలగంశెట్టి వచ్చే యేడాది ఓ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా వచ్చే ఏడాదే విడుదల. ఇక ప్రభాస్... ఓంరౌత్ 'ఆదిపురుష్' త్రీడీ మూవీ ఆగస్ట్ 11న రిలీజ్ అవుతోంది. ఈ రకంగా మన టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్ అన్నీ వచ్చే యేడాది భారీ ఎత్తున సందడి చేయబోతున్నాయి. మరి వీటికి ఇంకా ఏ యే చిత్రాలు జత అవుతాయో చూడాలి.