ఆ పని చేయండి.. పోటీ నుంచి తప్పుకొని బీజేపీకి ప్రచారం చేస్తా..!

ఆ పని చేయండి.. పోటీ నుంచి తప్పుకొని బీజేపీకి ప్రచారం చేస్తా..!

బీజేపీ ఎంపీలకు సవాల్ విసిరారు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్.. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖా ముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరుగా ఓటర్ల ముందుకు వచ్చి ఏమి చేస్తారో చెప్పి అడిగే అభ్యర్థులు ఎవరు లేరు అనుకుంటా? నేను ఇప్పటికి 10వేల మందికి పైగా పట్టభద్రులను కలవడం జరిగిందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక సందర్భంలో ప్రశ్నించే గొంతుకను గెలిపించండి అన్నారు.. అలా ఆయన మాటమీద ప్రశ్నించే గొంతుకగా నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.. పెట్రోల్ ధర, గ్యాస్ ధరలు పెరుగుతుంటే.. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను రామచందర్‌రావు ఎప్పుడైనా ప్రశ్నించారా? అని నిలదీసిన నాగేశ్వర్.. కొంచెం ప్రశ్నించే అభ్యర్థులను గెలిపించొద్దు ఏదైనా ప్రశ్నించే వారిని గెలిపించాలన్నారు.. రాష్ట్రంలో మొన్న కమిటీ ఇచ్చిన చెత్త పీఆర్సీ నివేదికకు మూలం కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమన్న ఆయన.. నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు ఎప్పుడైనా సీపీఎస్‌ను రద్దు చేయమని ఆడిగారా? అలా వారు అడిగితే నేను పోటీ నుండి తప్పుకొని బీజేపీకి ప్రచారం చేస్తానంటూ సవాల్ చేశారు. 

కేంద్రం అన్ని సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తుంటే కేసీఆర్ ప్రశ్నించలేదు.. వాళ్ల అభ్యర్థులు ప్రశ్నిస్తారని ఎద్దేవా చేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో కాదు.. ఇవాళ రాష్ట్రంలో పీఆర్సీ నివేదిక ప్రకారం లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి.. అవి ఎప్పుడు భర్తీ చేస్తారో ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. మొదట్లో నన్ను టీఆర్ఎస్ అభ్యర్థి అన్నారు.. టీఆర్ఎస్ మద్దతు నాగేశ్వర్‌కే అన్నారు.. ఇలా సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు.. ఇప్పుడు బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కాదు.. ప్రొఫెసర్‌ నాగేశ్వరరావే ప్రధాన ప్రత్యర్థి అన్నారాయన. ఎమ్మెల్యేగా ఎవరినైనా గెలిపించండి.. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రొఫెసర్‌ నాగేశ్వర్.