మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. వారితో కలిసి ఇదే తొలిసారి..!

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. వారితో కలిసి ఇదే తొలిసారి..!

2021లో తొలి ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. దాదాపు 95శాతం సక్సెస్‌ రేటు ఉన్న పీఎస్‌ఎల్‌వీ తో 19 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. మన దేశంలోని ప్రైవేట్‌ సంస్థలకు చెందిన ఐదు ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 19 ఉపగ్రహాల్లో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా1 ప్రధాన ఉపగ్రహం. అమెరికాకు చెందిన స్పేస్‌ బీస్‌ పేరుతో 12 ఉపగ్రహాలు, సాయ్‌1 నానో కాంటాక్ట్‌2 అనే ఒక ఉపగ్రహంతో పాటు యూనిటీశాట్‌ పేరుతో మూడు యూనివర్సిటీ విద్యార్థులు తయారుచేసిన మూడు ఉపగ్రహాలు, సతీష్‌ ధవన్‌ శాట్, సింధునేత్ర అనే ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు.

వాణిజ్యపరమైన ప్రయోగాలు చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది ఇస్రో. న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రారంభించాక పూర్తి స్థాయి వాణిజ్యపరమైన మొదటి ప్రయోగం ఇదే. ఉపగ్రహాల బరువు తక్కువగా ఉండడంతో దీన్ని రెండు స్ట్రాపాన్‌ బూస్టర్లతో నిర్వహించనున్నారు. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇది 78వది, పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 53వ ప్రయోగం కావడం విశేషం. ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో తొలి ప్రయోగం.. రేపు ఉదయం 10 గంటల24 నిమిషాలకు జరగనుంది..